ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం ఖరీదు ఎంత ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? లక్ష, పది లక్షలు, కోటి పదికోట్లు.. అంతేనా! కానీ తాజాగా నోవార్టిస్ ఉత్పత్తి చేసిన జోల్జెన్‌స్మా ఔషధం ఒక్క డోసు ఖరీదు తెలుసుకుంటే ఆశ్చరపోవడం ఖాయం. ఎస్‌ఎంఏ(స్పైనల్ మస్కులార్ అట్రోపీ) టైప్1 చికిత్సకు వాడే జోల్జెన్‌స్మా అనే ఔషధం ఒక్కడోసు ఖరీదు రూ. 18.20 కోట్లు. ఎస్‌ఎంఏ వ్యాధి చాలా అరుదుగా చిన్నారుల్లో కనిపిస్తుంది. ఇది సోకిన పిల్లల కండరాలు బలహీనపడి పక్షవాతం వచ్చినవారిలాగా కదల్లేకపోతారు. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో 90 శాతం మంది మరణిస్తుంటారు. ఈ క్రూరవ్యాధిని నివారించేందుకు నోవార్టిస్ జీన్ థెరపీస్ కంపెనీ జోల్జెన్‌స్మా అనే ఔషధాన్ని తయారు చేసింది.
అయితే ఈ వ్యాధిని జోల్జెన్‌స్మా పూర్తిగా నిరోధించలేదు. కానీ వ్యాధి పురోగమించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల ఎస్‌ఎంఏ సోకిన పిల్లలు వెంటిలేటర్ అవసరంలేకుండా గాలిపీల్చుకోగలగడమే కాకుండా, నెమ్మదిగా పాకడం, కూర్చోవడం, నడవడం కూడా చేయగలుగుతారు. ఈ ఔషధానికి ఇంగ్లాండ్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్ వాడుక అనుమతులిచ్చింది. దీని శాస్త్రీయ నామం ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్. వైద్య చరిత్రలో ఈ ఔషధం తయారీ ఒక విప్లవాత్మక అడుగుగా నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో ముంబైకి చెందిన దంపతులు వారి చిన్నారి కోసం ఈ మందును తెప్పించుకున్నారు.
ఇది కూడా చదవండి: కరోనా నుంచి కోలుకున్నాక మీ జుట్టు రాలిపోతుందా?