టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ టాప్ ర్యాంక్‌ను తిరిగి నిలబెట్టుకున్నాడు. గాయం కారణంగా బంజా లూకా టోర్నీకి దూరమైనప్పటికీ, ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకో గలిగాడు. ఇవ్వాల (సోమవారం) విడుదల చేసిన ర్యాంకుల్లో, జకోవిచ్ మొదటి స్థానంలోను, కార్లోస్ అల్కరాజ్ రెండవ ర్యాంకులోను కొనసాగుతున్నారు. అయితే, జకోవిచ్ ర్యాంకింగ్ పాయింట్లు తగ్గాయి. బోస్నియా, హెర్జెగోవినియాతో టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ నుంచి నిష్క్రమించడం, ఇటీవల బంజాలూకా రేసు నుంచి తప్పుకోవడంతో అతని రేటింగ్ స్కోరు తగ్గింది.
అదే సమయంలో బార్సిలోనా టైటిల్ గెలుపుతో అల్కరాజ్ స్కోరును పెంచుకున్నాడు. మరోవైపు ఆండ్రీ రుబ్లెవ్‌ను ఓడించిన లాజోవిక్ ఏకంగా 30స్థానాలు మెరుగయ్యాడు. టాప్ 50లో చోటు దక్కించుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 40వ స్థానం చేరుకున్నాడు. ఇక రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన రూడ్స్ నాల్గవ స్థానానికి పడిపోగా, డానిల్ మెద్వెదేవ్ మూడవ ర్యాంక్‌ను చేరుకున్నాడు.
డబుల్స్ విభాగంలో భారత ప్లేయర్లు రొహన్ బొపన్న (13) టాప్ 15లో చోటు దక్కించుకోగా, యుకి భాంబ్రి (76), సాకేత్ మైనేని (78), ఎన్ శ్రీరామ్ (86) టాప్ 100లో నిలిచారు. అనిరుధ్ చంద్రశేఖర్ (129), అర్జున్ కాధే (132), రాంకుమార్ రామనాథన్ (144), విజయ్ సుందర్ (144), దివిజ్ శరణ్ (151) ర్యాంకుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.