Tuesday, November 26, 2024

TS Elections | రేపే నోటిఫికేష‌న్.. ఉద‌యం10నుంచి మధ్యాహ్నం 3దాకా నామినేషన్ల స్వీకరణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పోరు తెలంగాణ రేపటి(శుక్రవారం)నుంచి హోరెత్తనుంది. అసలు ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. నోటిఫికేషన్‌తో ఎన్నికల గంటలు మోగనున్నాయి. తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టానికి రేపు తెరలేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనున్నది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదలకు గవర్నర్‌ అనుమతి కూడా తీసుకున్నది.

ఉదయం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. అసెంబ్లి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 9న షెడ్యూల్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియకు తెరలేవనుంది. ఈ నెల 10వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13 వరకు నామినేషన్ల పరిశీలన పూర్తిచేయనున్నారు. ఉపసంహరణకు 15 వరకు గడువిచ్చారు.

- Advertisement -

తాజా నోటిఫికేషన్‌ అనంతరం శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేయవచ్చు. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ నెల 5న ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు నామినేషన్లు తీసుకునే అవకాశం లేదు. ఆ ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు.

ఏ రోజైనా నామినేషన్లు వేయడానికి ఎక్కువ మంది అభ్యర్థులు వస్తే వారికి స్లిప్‌లు అందజేస్తారు. వాటిని తీసుకొని మరుసటి రోజు నామినేషన్‌ వేయవచ్చు. కాగా నామినేషన్లు వేసే అభ్యర్థులు ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. ప్రధానంగా మంచి రోజును చూసుకొని నామినేషన్లను దాఖలు చేస్తుంటారు. అయితే శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అవకావం ఉన్నప్పటికీ ఈ నెల 8 నుంచి 10 వరకు మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ మూడు రోజులు ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

అప్పటినుంచే అసలు హోరు మొదలవనుంది. నామినేషన్‌ రోజు నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీఐ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ మేరకు వ్యయ పరిశీలకులు కూడా రాష్ట్రంలోకి చేరుకున్నారు. సాధారణ, ఇతర పరిశీలకులు కూడా క్షేత్రస్థాయికి చేరారు. రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ మధ్యాహ్నం 10 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 13వ తేదీన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరుగనున్నది.

ఈ నెల 15 వరకు నామినేషన్‌ ఉపసంహరించుకునే అవకాశం ఉన్నది. అదే రోజు తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీంతో ఎన్నికల కోడ్‌ తొలగిపోనుంది. నామినేషన్ల నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్రంలో ఎక్కడ ఓటు హక్కు ఉన్న అభ్యర్థికైనా అర్హత ఉంటుంది. అయితే సదరు అభ్యర్థిని బలపరిచే వ్యక్తులు మాత్రం స్థానిక ఓట్లం ఉండాలి.

ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయవచ్చు. అభ్యర్థులు అఫిడవిట్‌ను అసంపూర్తిగా నింపి ఇస్తే దానికి ఆర్వో నోటీసులు జారీ చేస్తారు. అభ్యర్థి దానిని సవరించాల్సిందిగా సూచిస్తారు. అప్పటికీ అభ్యర్థి స్పందించకుంటే నామినేషన్‌ తిరస్కరించే అధికారం ఆర్వోకు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే జనరల్‌, బీసీ అభ్యర్థులు రూ.10వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు ధరావతు కింద చెల్లించాల్సి ఉంటుందని ఈసీఐ పేర్కొన్నది. నవంబర్‌ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల సంఘం బృందం బుధవారం సమీక్షించింది.

ఇప్పటి వరకు జరిగిన ఫూల్‌ ప్రూఫ్‌ ఏర్పాట్లను, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతను తెలుసుకోవడానికి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమీషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌ కుమార్‌ వ్యాస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌లతో కూడిన బృందం న్యూఢిల్లీ నుండి వచ్చింది. ఎన్నికలకు సంబంధించి వారు అనేక సూచనలు ఇచ్చారు. మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేసి పోజిషన్‌లను తీసుకోవాలని కోరారు. ఎన్నికల వ్యయాన్ని నామినేషన్‌ నాటినుంచే లెక్కలోకి తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల పర్వంనుంచే రాష్ట్రంలో అసలు ఎన్నికల వేడి మొదలుకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement