అమరావతి,ఆంధ్రప్రభ: పాలనా పరమైన కారణాలతో వాయిదా పడిన పాలిసెట్ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుండి ప్రారంభం కానుందని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్, పాలిటెక్నిక్ అడ్మిషన్ల కన్వీనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అగస్టు 10వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ అందుబాటులో రానుందన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేష్రన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విధ్యార్ధులు ఆగస్టు 11 నుండి 14వ తేదీ వరకు నాలుగు రోజుల లోపు ఐచ్చికాల ఎంపిక పూర్తి చేయాలని కన్వీనర్ స్పష్టం చేసారు.
ఆగస్టు 16 తేదీ ఐచ్చికాల మార్పుకు అవకాశం ఉంటుందని, 18 తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. ఆగస్టు 19 నుండి 23 వరకు ఐదు రోజుల వ్యవధిలో విద్యార్ధులు అయా కళాశాలల్లో రిపోర్టు చేయవలసి ఉంటుందన్నారు. 23వ తేదీనే క్లాసులు ప్రారంభం అవుతాయని చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు. మొత్తం 88 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో 18141 సీట్లు, 182 ప్రవేటు పాలిటెక్నిక్ లలో 64933 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మొత్తంగా 270 కళాశాలల్లో 83,074 సీట్లు సిద్దంగా ఉన్నాయని వివరించారు.