తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మెగా డీఎస్సీ ద్వారా దాదాపు 11,060 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.
ఇప్పటికే డీఎస్సీ నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. టీచర్ల పదోన్నతులు, బదిలీల్లో ఇబ్బందులపై దృష్టిసారించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులు లేరనే సాకుతో మూసేసిన బడులను మళ్లీ తెరిపించాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నా.. బడి నడవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ద్వారా టీచరు పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.