17 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు
జూన్ ఒకటో తేదిన పోలింగ్
14వ తేదిన వారణాసిలో మోదీ నామినేషన్
హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక
దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ కంప్లీట్ కాగా.. మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. చివరిదైన ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవాళ్టి (బుధవారం) నుండి ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. 15న నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
జూన్ ఒకటో తేదిన పోలింగ్…
జూన్ 1న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్ 9, ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్‌లో 3 స్థానాలకు లాస్ట్ ఫేజ్‌లో పోలింగ్ జరగనుంది.
14వ తేదిన మోదీ నామినేషన్..
ఏడో విడతలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈనెల 14వ తేదీన ప్రధాని మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా, అటు హిమాచల్ ప్రదేశ్‌లోని ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక ఈ విడతలోనే జరగనుంది. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.