హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబ్ కేలండర్ ప్రకారం ఆరోగ్యశాఖలో ఖాళీగా ఉన్న 2050 స్టాఫ్ నర్సుల ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటీఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటీఫికేషన్‌లో భాగంగా రాష్ట్ర కుటుంబ సంక్షేమం, మెడికల్ డైరెక్టర్ విద్యలో 1576 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 332 పోస్టులు, ఆయూష్‌లో 61, ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1, ఎంఎన్‌జే ఇనిస్ట్యూట్ ఆఫ్ అంకాలజీ, రీజినల్ క్యాన్సర్ కేంద్రంలో 80 పోస్టులతో మొత్తం 2050 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అదే సమయంలో రానున్న రోజుల్లో ఖాళీలు మరిన్ని పెరిగితే వాటిని జోడించడం లేదా తగ్గిస్తామని నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ఆన్‌లైన్ లో 28.9.2024 నుండి ప్రారంభంకానుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించేందుకు అక్టోబరు 14 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు.
దరఖాస్తు దారులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అక్టోబరు 16న ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 వరకు సమయం ఇచ్చారు. ఖాళీల భర్తీకి నవంబరు 17న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. 100 పాయింట్ల ప్రాతిపదికన రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ను చేపడతామని వెల్లడించారు.
ఇందులో 80 పాయింట్లు రాత పరీక్షలో పొందాలని, మరో 20 మార్కుల వెయిటీజీ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కార్యక్రమాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆరు నెలలుగా పనిచేస్తుంటే 2.5 పాయింట్లు ఇవ్వనున్నట్లు నోటీఫికేషన్‌లో పేర్కొన్నారు.
బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్- మిడ్‌వైఫరీ జీఎన్‌ఎం అర్హతులు ఉన్న అభ్యర్థులు ఈ పోసటులకు అర్హులని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,050 నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల తెలంగాణ నర్సుల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. నర్సింగ్ ఆఫీసర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది.