హైదరాబాద్, ఆంధ్రప్రభ : నిరుద్యోగులకు తీపికబురునందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో మెగా నోటీఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 1540 ఉద్యోగాల భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఏఈఈ పోస్టుల భర్తీకి ఈ నెల 22 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షార్ట్ నోటీసును విడుదల చేసింది. ఈ నోటీసులో నోటిఫికేషన్ వివరాలతోపాటు ఏఈఈ ఉద్యోగాల భర్తీ సమగ్ర సమాచారాన్ని పొందుపరిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల 15న వెల్లడై దరఖాస్తులు 22నుంచి మొదలవుతాయని వెల్లడించింది. అక్టోబరు 14 వరకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మొత్తం 1540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ నియామకానికి సంబంధించిన నియామక పరీక్ష డిసెంబరులో లేదా వచ్చే ఏడాది జనవరిలో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. షార్ట్ నోటీసును వెల్లడించిన ప్రభుత్వం పూర్తి నోటిఫికేషన్ను 15న విడుదల చేయనుంది.
పోస్టులు…
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్అండ్ఆర్డీ(పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్) మిషన్ భగీరథలో 302 పోస్టులు, ఏఈఈ సివిల్ విభాగంలో 211 పోస్టులు, ఎంఏయూడీ టీహెచ్ విభాగంలో 147 ఏఈఈ పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్లో 15, నీటిపారుదల శాఖ లో 704 పోస్టులు ఉండగా ఇందులో సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఏఈఈ మెకానికల్ ఇరిగేషన్లో 3, ఏఈఈ సివిల్ ఆర్అండ్బీలో 13 పోస్టులతో కలిపి మొత్తం 1540 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని , మిగిలిన కొన్ని పోస్టులకు సివిల్, మెకానికల్, ఎల క్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని నోటిఫికేషన్లో వెల్లడించారు. వేతనం రూ.54220 నుంచి రూ.1,33, 633 మధ్య చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.