Saturday, November 23, 2024

విభజన కేసులో కేంద్రానికి, తెలంగాణకు నోటీసులు.. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపర్చిన మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపిణీ వెంటనే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ విచారణకు రాగా.. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులిస్తూ 6 వారాల్లోగా బదులివ్వాలని ధర్మాసనం ఆదేశించింది.

వాటిపై రిజాయిండర్ దాఖలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు దాటినప్పటికీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థల విభజన ఇంతవరకు జరగలేదని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రెండు షెడ్యూల్ సంస్థల విలువ దాదాపు రూ. 1,42,601 కోట్లుగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ సంస్థల్లో పనిచేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యగులు అనిశ్చిస్థితిలో ఉన్నారని నివేదించింది.

ఈ రెండు షడ్యూళ్లకు సంబంధించి దాదాపు 91 శాతం సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయని, వాటిని విభజించే విషయంలో తెలంగాణ నుంచి సహకారం లేదని కోర్టుకు వివరించింది. ఈ కారణంగా విభజనలో జాప్యం జరుగుతోందని పేర్కొంది. చట్టం ప్రకారం ఈ సంస్థల విభజన తక్షణమే చేపట్టేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement