Saturday, November 23, 2024

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ప్రతివాదులకు నోటీసులు.. అన్ని అంశాలపై జులై 31న విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మినహా మిగతా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్‌పై ఇదివరకే విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తదుపరి విచారణ జులై 31కి వాయిదా వేసింది. గత విచారణ సందర్భంగా సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ‘స్టేటస్ కో’ ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయలేదు. ఈ క్రమంలో శుక్రవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును ప్రస్తావించింది.

సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దంటూ ఇచ్చిన ఆదేశాల్లో దర్యాప్తు సంస్థకు నోటీసులు లేవని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ధర్మాసనం కేసుపై తెలంగాణ పోలీసుల దర్యాప్తు సైతం నిలిపివేయాలని స్పష్టం చేసింది. యథాతథ స్థితి అంటే ఏ దర్యాప్తు సంస్థ కూడా విచారణ కొనసాగించకూడదని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిట్ దర్యాప్తు నిలిపివేసి చాలా రోజులైందని వెల్లడించారు. అనంతరం కేసు ప్రతివాదుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని మినహాయించి సీబీఐ సహా మిగతా ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ముందే నిర్ణయించిన తేదీ జులై 31న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement