Friday, November 22, 2024

అమరావతి కేసులో ప్రతివాదులకు నోటీసులు.. నెలాఖరులోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల వ్యవహారంలో అమరావతి రైతులు, వివిధ పార్టీల నేతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 31లోగా కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. మూడు రాజధానులను తప్పుబడుతూ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. గత విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరటిస్తూ హైకోర్టు తీర్పులోని 7 అంశాల్లో 5 అంశాలపై ‘స్టే’ విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలను సైతం ధర్మాసనం లేవనెత్తింది.

హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని అభిప్రాయపడింది. కోర్టే ప్రభుత్వమైతే ఇక మంత్రివర్గం ఎందుకని వ్యాఖ్యానించింది. అప్పుడే కేసులో ప్రతివాదులుగా ఉన్నవారికి నోటీసులు జారీ చేసి జనవరి 31న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. తాజాగా కేసులో రైతులు, వివిధ పార్టీల నేతలు కలిపి మొత్తం 161 మందికి నోటీసులు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై తమ వాదన కౌంటర్ అఫిడవిట్ రూపంలో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. జనవరి 31న ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement