న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులు ఎట్టకేలకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్ కార్యాలయానికి చేరాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు సవరించిన నోటీసులను ఢిల్లీ పోలీసుల సహాయంతో సిట్ బృందంలోని అధికారులు మంగళవారం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉన్న బీఎల్ సంతోష్ కార్యాలయానికి చేరవేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. తొలుత సీఆర్పీసీ సెక్షన్ 41(ఏ) ప్రకారం వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నోటీసులు నేరుగా అందించే విషయంలో తమకు ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు నివేదించగా, సహకరించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయవద్దని, పిలిచి ప్రశ్నించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సవరించిన నోటీసులను సిట్ బృంద సభ్యులు ఢిల్లీకి తీసుకొచ్చారు. అయితే గత రెండు మూడు రోజులుగా పార్టీ కార్యాక్రమాల నిమిత్తం బీఎల్ సంతోష్ గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఆయన ఢిల్లీలోని తన కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో మొదటి అంతస్తులో 102 నెంబర్ గదిని ఆయన తన కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. బీఎల్ సంతోష్ ఢిల్లీలో లేనప్పుడు ఆ గది తాళం వేసి ఉంటుంది. కార్యాలయ సిబ్బంది సైతం ఆయన లేనప్పుడు కార్యాలయానికి రారని పార్టీవర్గాలు తెలిపాయి.
విచారణకు హాజరవుతారా?
నోటీసులైతే ఆయన కార్యాలయానికి చేరుకున్నాయి కానీ ఆయన మాత్రం కార్యాలయంలో అందుబాటులో లేరు. దీంతో సాంకేతికంగా నోటీసులు ఇంకా ఆయన్ను చేరుకోలేదు. ఆయన ఢిల్లీకి తిరిగొచ్చిన తర్వాత నోటీసులపై ఎలా స్పందించాలన్నది నిర్ణయించుకుంటారని తెలిసింది. నోటీసుల్లో పేర్కొన్న తేదీన హాజరవ్వాలా.. లేదంటే వెసులుబాటున్న మరో తేదీన సమయం కోరి హాజరవుతారా అన్న విషయంపై స్పష్టత లేదు.