సింధూ జలాల ఒప్పందాన్ని మార్చుకునేందుకు సమయం వచ్చిందంటూ భారత్, పాకిస్థాన్‌కు నోటీసు జారీ చేసింది. ఒప్పందంలో పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య గత కాలంగా విబేదాలు కొనసాగుతున్నాయి. ఒప్పందం అమలుపై పాక్ కనబరుస్తున్న మొండి వైఖరి కారణంగానే ఈ నోటీసు పంపించాల్సి వచ్చింది. సింధు జలాల ఒప్పంద కమిషనర్ల ద్వారా ఈ నెల 25న ఈ నోటీసు పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సింధు నదీ జలాల ఒప్పందాన్ని స్ఫూర్తితో అమలు చేసే విషయంలో భారత్ ఎల్లప్పుడూ కృతనిశ్చయం, బాధ్యతతో హుందాగా వ్యవహరించింది. అయితే, పాకిస్థాన్ చర్యలు ఒప్పందం నిబంధనలు, అమలుకు ఆటంకం కలిగించేలా ఉన్నాయి. ఫలితంగా ఒప్పందాన్ని సవరించే సమయం ఆనస్నమైంది.
అందుకే ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కిసన్గంగా, రాటిల్ జల విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత ఐదేళ్లుగా పాక్ చర్చలకు సాకులు చూపుతూ కాలాయాపన చేస్తుంది. ఈ నేపథ్యంలో నోటీసు జారీ చేయాల్సి వచ్చింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునేందుకు అవకాశం దొరికినట్లైంది. పలు అంశాలపై పాక్ దాటవేత వైఖరి అవలంబిస్తుంది. కిషన్ గంగా. రాటిల్ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తు కాలాయాపన చేస్తున్న పాకిస్థాన్, ప్రాజెక్టుల అభ్యంతరాలను పరిశీలించేందుకు తటస్థ నిపుణులు కావాలంటూ 2015లో అభ్యర్థన చేసింది.
అయితే, ఏడాది కాలంలోనే మాట మాట మార్చి, తన అభ్యర్థనను వెనక్కి తీసుకుంది. పాక్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణులకు అప్పగించాలని ప్రపంచ బ్యాంక్‌కు అభ్యర్థించింది. స్పందించిన ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రారంభించింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలు చేప్పడం ఏమిటని ప్రశ్నించింది. ఇది ఒప్పందం ఉల్లంఘన కింద వస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటినంటినీ దృష్టిలో పెట్టుకుని నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని భారత్ పేర్కొంది.
సింధు నదీ జలాల ఒప్పందం: సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్-పాక్ దేశాల మధ్య 1960 సెప్టెంబరు 19న సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, అప్పుడు పాకిస్థాన్‌కు అధ్యక్షుడుగా ఉన్న అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో 1969లో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. ఒప్పందం ఫలితంగా సింధు, జీలం,చీనాబ్ నదులు పాక్‌కు దక్కాయి. భారత్‌కు రావి, బియాస్, సట్లేజ్ నదులు దక్కాయి. ఒప్పందంపై రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి బాధ్యులుగా రెండు దేశాల నుంచి కమిషనర్లు ఉన్నారు. భారత్ నోటీసుపై పాకిస్థాన్ ఎలా స్పందింస్తుందనే దానిపై వేచిచూడాలి.