Friday, November 22, 2024

ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు.. పార్లమెంట్‌లో ఎంపీల నిరసన..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణా విభజనపై ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయా లేదా అన్న అంశంపై న్యాయ సలహా తీసుకుంటామని టీఆర్‌ఎస్ స్పష్ట చేసింది. ఆ పార్టీ పార్లమెంటరీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వరావుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, రాములు, మాలోత్ కవిత, లింగయ్య యాద్, వెంకటేష్ నేత, కెప్టెన్ లక్ష్మీకాంతరావు తదితరులు బుధవారం తెలంగాణా భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని, పార్లమెంట్ పద్ధతులను మంటగలిపే విధంగా పీఎం మోడీ మాట్లాడారని మండిపడ్డారు. పార్లమెంట్ పద్ధతుల గురించి తెలిసిన వారెవరూ ఇలా మాట్లాడరని, శాస్త్రీయం-అశాస్త్రీయమంటూ ఏమీ ఉండదని, మెజారిటీ ఉందా లేదా అన్నది చూసి బిల్ పాస్ చేస్తుంటారని కేకే చెప్పారు. సభలో గలాటా జరిగితే, అప్పుడేం చేయాలన్న విషయంపై కూడా రూల్ బుక్ ఉందని ఆయన వివరించారు. తెలంగాణా బిల్లు సమయంలో బీజేపీ కూడా మద్దతు తెలిపిందనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. లగడపాటి రాజగోపాల్, మరికొందరు గలాటా చేసినా రూల్ బుక్ నిబంధనల మేరకే సభాపతి వ్యవహరించారని తెలిపారు. మెజారిటీ విషయంలో ఎవరైనా స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తే లాబీ క్లియర్ చేసి ఓటింగ్ నిర్వహిస్తారని, కౌంటింగ్ నిర్వహించడం సాధ్యపడని పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలన్నది కూడా రూల్ బుక్‌లో ఉందని కేకే స్పష్టం చేశారు. పెప్పర్ స్ప్రే ఘటన మినహా పూర్తి శాస్త్రీయంగా తెలంగాణ బిల్లు పాసైందని, నిజానికి ఇప్పుడు బిల్లులను పాస్ చేస్తున్న తీరును అశాస్త్రీయం అనవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటును, సభాపతులను కించపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారని, జార్ఖండ్ బిల్ సమయంలో కూడా కొందరు వాజ్‌పేయి మీదకు దూసుకెళ్లారని గుర్తు చేశారు. పార్లమెంట్ పద్ధతులు తెలియకుండానే ఒక ప్రధాని ఇలా మాట్లాడ్డం ఎప్పుడూ చూడలేదని కేశవరావు విస్మయం వ్యక్తం చేశారు. రాజకీయ సంబంధాలు సరిగా లేకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అనుకోలేదని వాపోయారు.

అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ… 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తెలంగాణాదని, ఉద్యమానికి తన ప్రాణాన్ని ఇస్తానని ముందుకు వచ్చిన నేత సీఎం కేసీఆర్ అని హర్షం వ్యక్తం చేశారు. ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్నారని, ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆనాడు లోక్‌సభలో చెప్పిన విషయాన్ని, బీఏసీ సమావేశంలో అందరి ముందు తెలంగాణ బిల్లు కోసం డిమాండ్ చేశామని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక మాట్లాడిన వ్యాఖ్యలు బాధాకరమని, రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పడితే అవమానపరిచే విధంగా ప్రధాని మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏమీ ఇవ్వకున్నా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ప్రధాని బాధపడుతున్నారని నామా చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలు భారత దేశ ప్రజలు కారా అని ప్రశ్నించారు. తెలంగాణా ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ ప్రధానిలో ఈర్ష్య కనబడుతోందని నొక్కి చెప్పారు. ప్రజల దేవాలయమైన పార్లమెంట్‌ను కించపరిచేలా ప్రధాని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి జరగవద్దనే ఈ కుట్రలను అందరూ ఏకమై తిప్పికొట్టాలని నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement