తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకలో ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్లే దేశం ఈ దుస్థితి ఎదుర్కొంటోందంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇందుకు కారణమైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ నిరసనలు జరుగుతున్నాయి. గత నెలలో అధ్యక్షుడి నివాసం వద్ద జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో అధ్యక్షుడు గొటబాయ సోదరుడైన ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేశారు. అయితే, అధ్యక్షుడు మాత్రం రాజీనామాకు ససేమిరా అన్నారు. ప్రజలు మాత్రం ప్రధాని రాజీనామా ఒక్కటే సరిపోదని, అధ్యక్షుడు కూడా రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గొటబాయ రాజపక్స మాట్లాడుతూ.. ప్రజలు తనకు ఐదేళ్లపాటు పాలించమని అధికారం ఇచ్చారని, దానిని పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. తనకింకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉందని, అది పూర్తయ్యాక తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement