Saturday, November 23, 2024

ఉద్వేగాల భారతం కాదు, ఉద్యోగాల భారతం ముఖ్యం.. ప్రధానిపై మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రధాని నరేంద్ర మోడీపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్‌ వేదికగా ఘాటైన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదని, అటెన్షన్‌ డైవర్షన్‌ ప్రభుత్వమని విరుచుకుపడ్డారు. దేశంలో సమస్యలే లేవంటూ అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్‌ ధరలు, ఆకాశన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రధాని మోడీ కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కుట్రలను కనిపెట్టకపోతే దేశానికి, భవిష్యత్‌ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

దేశం కోసం ధర్మం కోసం అనేది భాజపా అందమైన నినాదం మాత్రమేనని కేటీ రామారావు వ్యాఖ్యానించారు. విద్వేషం కోసం ఆదర్శం కోసం అనేది అసలు రాజకీయ విధానమని పేర్కొన్నారు. హర్‌ఘర్‌ జల్‌ అన్నారు.. కాని హర్‌ ఘర్‌ మే జహర్‌, హర్‌ దిల్‌ మే జహర్‌ అంటూ విద్వేషాన్ని నింపే కుట్రకు ఒడిగడుతున్నారంటూ మండిపడ్డారు. సామాజిక మాద్యమాల ద్వారా దేశంలోని సోషల్‌ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆయన సూచించారు. ఉద్వేగాల భారతం కాదు ఉద్యోగాల భారతం ముఖ్యమని కేటీ రామారావు ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement