Monday, November 18, 2024

Tamilanadu: ఆ బాలికది ఆత్మహత్యే.. రేప్​, మర్డర్​ వంటి ఆధారాల్లేవన్న మద్రాస్​ హైకోర్టు

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో ఈ మధ్య జరిగిన ఓ విద్యార్థిని ఆత్మహత్యపై పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. బాలికను రేప్​ చేసి చంపేశారన్న ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. స్కూల్​ నిర్వాహకులు, ఉపాధ్యాయులపై దాడులు చేసి, స్కూలు ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ పరిస్థితులు చాలా రోజులపాటు హింసకు దారితీశాయి. అయితే.. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మద్రాసు హైకోర్టు బాలికది ఆత్మహత్యేనని, రేప్​, మర్డర్​ వంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. అంతేకాకుండా టీచర్లను అనవసరంగా 45 రోజులకు పైగా జైలులో ఉంచడం దురదృష్టకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కళ్లకురుచ్చిలో 17 ఏళ్ల విద్యార్థిని మృతిపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ బాలికది ఆత్మహత్యనే అని, పోస్టుమార్టంలో ఎట్లాంటి ఇతర ఆధారాలు లభించలేదని జడ్జి పేర్కొన్నారు. ఫౌల్ ప్లే చేయడాన్ని తోసిపుచ్చింది మద్రాస్ హైకోర్టు. ఇది ఆత్మహత్యేనని, హత్య, అత్యాచారం కాదని స్పష్టం చేసింది. బాలికకు సంబంధించిన రెండు పోస్టుమార్టం నివేదికలను విశ్లేషించిన పుదుచ్చేరిలోని జిప్మర్‌కు చెందిన ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం నివేదిక ఆధారంగా జస్టిస్ జీకే ఇళంతిరైయన్ ఇవ్వాల (మంగళవారం) ఈ ఉత్తర్వులు ఇచ్చారు.

జస్టిస్ ఇళంతిరాయన్‌ మాట్లాడుతూ.. ప్రాథమికంగా ఈ కేసు ఆత్మహత్యకు సంబంధించిన స్పష్టమైన కేసుగా కనిపిస్తోందని, అత్యాచారం, హత్య కాదని అన్నారు. JIPMER నివేదికతో పాటు, రెండు పోస్ట్ మార్టం నివేదికలను విశ్లేషించిన తరువాత బాలికకు తగిలిన గాయాలు.. భవనం మూడవ అంతస్తు నుంచి దూకడం వల్ల కలిగినవేనని అన్నారు. అత్యాచారం, హత్య కింద నేరాన్ని మోపడానికి ఎటువంటి ఆధారాలు లేవని నిర్ధారించారు. డిఫాక్టో ఫిర్యాదు దారు తరఫు న్యాయవాది.. హాజరవుతున్న న్యాయవాది శవపరీక్ష నివేదికల మధ్య చాలా వైరుధ్యాలున్నప్పటికీ అది అత్యాచారం, హత్య నేరాన్ని సూచించడం లేదన్నారు. అంతే కాకుండా మరణించిన వ్యక్తి సూసైడ్ నోట్‌ను పరిశీలిస్తే, కెమిస్ట్రీ సబ్జెక్టులో ఫెయిల్​ కావడం, ఆ స్టూడెంట్​ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ క్రమంలో సూసైడ్ నోట్​ని కూడా కోర్టు జత చేసింది. ఇంకా మూడో అంతస్తులోని మెట్ల దగ్గర రక్తంగా అనుమానించిన ఎరుపు రంగు గుర్తులు రక్తం మరకాలు కాదని నివేదికలో తెలిపారు. ఈ క్రమంలో గత వారం పాఠశాల ఉపాధ్యాయులు, నిర్వాహకులందరికీ — ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు.

- Advertisement -

అసలు కేసు ఏమిటంటే..

సేలం జిల్లాలోని కళ్లకురిచ్చిలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జులై 13న హాస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. హాస్టల్‌ మూడో అంతస్తులోని ఓ గదిలో ఉంటున్న బాలిక పైఅంతస్తు నుంచి కిందికి దూకి తన జీవితాన్ని ముగించుకుందని అనుమానిస్తున్నారు. అయితే.. ఉపాధ్యాయుల వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. కాగా, ఆమె మరణం ఆత్మహత్య కాదని, ఆమె మరణానికి ముందు ఆమెకు గాయాలయ్యాయని, లైంగిక దాడి కూడా జరిగిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో జులై 17న పాఠశాల ఆవరణలో హింస చెలరేగింది. ఆందోళనకారులు పాఠశాలను ధ్వంసం చేయడంతోపాటు వాహనాలకు నిప్పు పెట్టారు.

ఉపాధ్యాయుల అరెస్టుపై కోర్టు ప్రశ్నలు..

ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం అరెస్టు గురించి కోర్టు మాట్లాడుతూ.. తప్పు చేయని వారు 45 రోజులకు పైగా జైలులో ఉండవలసి రావడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. ఇక.. “విద్యార్థులు, తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులు బెదిరింపులను ఎదుర్కోవడం దురదృష్టకరం. విచారకరం. ఉపాధ్యాయ వృత్తిలో భాగంగా బాగా చదువుకోవాలని విద్యార్థులకు సలహా ఇచ్చినందుకు వారిని జైలులో పెట్టడం చాలా దురదృష్టకరం” అని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.  హింస నేపథ్యంలో అరెస్టయిన స్కూల్ కరస్పాండెంట్, సెక్రటరీ, ప్రిన్సిపాల్, ఇద్దరు మహిళా టీచర్లకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అస్థిరమైన పరిస్థితి కారణంగా న్యాయమూర్తి పాఠశాల కరస్పాండెంట్, అతని భార్య, ప్రిన్సిపాల్‌ను నాలుగు వారాల పాటు మదురైలో ఉండాలని ఆదేశించారు. ఇద్దరు ఉపాధ్యాయులు నాలుగు వారాల పాటు సేలంలో నివాసం ఉండాలని, పోలీసుల ఎదుట రిపోర్టు చేయాలని కోర్టు ఆదేశించింది.

సిట్ నివేదిక ఏం చెబుతుందంటే..

హింస కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన ప్రాథమిక స్థితి నివేదికను కూడా హైకోర్టుకు సమర్పించింది. జులై 17న చెలరేగిన హింసాకాండ కారణంగా రూ.3.46కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో అంచనా వేశారు. దర్యాప్తు అధికారులు ఇప్పటివరకు 202 మంది సాక్షులను విచారించారు. ఇందులో 68 మంది గాయపడినట్టు తెలిపారు. ఇప్పటివరకు 954 వీడియోలు, 150 ఫోటోగ్రాఫ్‌లు సేకరించారు. వస్తువులను తగులబెట్టడం, దెబ్బతీయడం వంటి తీవ్రమైన నేరాలను కలిగి ఉన్న వీడియోల నిర్దిష్ట భాగాలు ఆస్తులు, గేట్లను బద్దలు కొట్టడం, పోలీసు సిబ్బందిపై దాడి తదితరాలను విశ్లేషించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.  ఈ ప్రక్రియ ద్వారా గుర్తించిన ముగ్గురు మైనర్‌లతో సహా 53 మంది నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.  విచారణపై సంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ కేసును సెప్టెంబర్ 27కి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement