Tuesday, November 26, 2024

Delhi | నా సోదరుడు మాత్రమే కాదు.. అందరూ కాంగ్రెస్‌లోకి తిరిగొస్తారు: కోమటిరెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ వీడి వెళ్లిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాత్రమే కాదు, ఇంకా చాలా మంది మళ్లీ తిరిగొచ్చేస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్) అన్నారు. శుక్రవారం సాయంత్రం గం. 4.30 సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో 10, జన్‌పథ్‌లో సమావేశమైన అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్రంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమాల గురించి ప్రియాంక గాంధీకి వివరించానని, అలాగే తెలంగాణలోని 33 జిల్లాలను 3 నెలల్లో కలియతిరిగేలా ప్రియాంక గాంధీ వరుసపెట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరినట్టు చెప్పారు.

కనీసం ప్రతి 10 రోజులకు ఒకసారైనా ప్రియాంక తెలంగాణలో పర్యటించేలా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు ఆయన చెప్పారు. తన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రియాంక గాంధీ, జులై 7 తర్వాత తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తనకు హామీ ఇచ్చారని వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణలో ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు గెలిపించాలని ఆమె దిశానిర్దేశం చేసినట్టు వెల్లడించారు.

కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా పోరాడాలని సూచించినట్టు చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు విబేధాలు పక్కనపెట్టి కలసికట్టుగా పనిచేయడం వల్ల పార్టీ ఘన విజయం సొంతం చేసుకుందని, అదే మాదిరిగా తెలంగాణలోనూ పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించినట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నేతల మధ్య విబేధాలు లేవని, అందరం కలసికట్టుగా పనిచేస్తున్నామని చెప్పారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసి ఇతర పార్టీలోని నేతలు, కాంగ్రెస్ వీడి వెళ్లినవారు సొంతగూటికి తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా మీ సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తిరిగొస్తారా అని ప్రశ్నించగా.. “అందరూ వస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -

అయితే కొన్ని అంశాలు పార్టీ అంతర్గత వ్యవహారాలని, వాటి గురించి తాను ప్రియాంక గాంధీతో చర్చించానని అన్నారు. అయితే వాటిని బహిర్గతం చేయలేనని చెప్పుకొచ్చారు. మరోవైపు కర్ణాటక తరహాలోనే ఎన్నికలకు 2-3 నెలల ముందే కనీసం 60 శాతం అభ్యర్థులను ప్రకటించాలని, తద్వారా వారంతా తమ తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకోడానికి ఆస్కారం ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం నెరవేరుతుందని వెంకటరెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement