న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇప్పటి వరకు జీ20. ఇక నుంచి జీ21. భారత్ అధ్యక్షతన దేశ రాజధాని న్యూఢిల్లీలోని ‘భారత మండపం’ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేక ఆహ్వానిత సంస్థగా ఉన్న ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వాన్ని పొందింది. ఇప్పటి వరకు జీ20లో 19 దేశాలతో పాటు యురోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అందుకే మొత్తంగా జీ-20 అంటూ వ్యవహరిస్తూ వచ్చారు. అయితే జీ20ను విస్తరించాలన్న ఆలోచనలో భాగంగా ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారతదేశం ప్రతిపాదించింది. సభ్య దేశాలు ఇందుకు సానుకూలంగా స్పందించడంతో శనివారం సదస్సు తొలి అంకంలోనే ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించారు.
ఇది ప్రజల జీ20 – ప్రధాని మోదీ
జీ20 సదస్సు నిర్వహణలో అడుగడుగునా ఘనమైన భారతదేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశాధినేతలకు స్వాగతం పలికే ప్రాంతంలో వెనుకాల కోణార్క్ ఆలయంలోని రథచక్రం పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. సదస్సు జరిగే వేదిక వద్ద ప్రధానికి వెనుక వైపున ‘నలంద మహావిహార’ పోస్టర్ ఏర్పాటు చేశారు. సభ్యదేశాలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రారంభోపన్యాసంలో 2,500 సంవత్సరాల క్రితం నాటి ప్రాకృత పదాలను ఉదహరించారు.
మొత్తంగా ఈ జీ20ను ప్రజల జీ20గా ఆయన అభివర్ణించారు. మొదట మొరాకోలో సంభవించిన భూకంపం కారణంగా ప్రభావితమైన ప్రజలకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచ సమాజం మొత్తం మొరాకోకు అండగా ఉందని, తాము వారికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ అన్నారు. జీ20 సదస్సు జరుగుతున్న వేదికకు కొన్ని కిలోమీటర్ల దూరంలో 2,500 సంవత్సరాల నాటి ఓ పురాతన స్తంభం ఉందని, దానిపై ప్రాకృత భాషలో చెక్కిన పదాలు ‘हेवम लोकसा हितमुखे ति,
अथ इयम नातिसु हेवम’ (హేవం లోకాస హిత్ముఖే తి, అత్ ఇయం నాతీసు హేవం)లను ప్రధాని మోదీ ఉటంకించారు. మానవాళి ఎల్లప్పుడూ సంక్షేమంతో సంతోషంగా ఉండాలి అన్నదే ఆ పదాల అర్థమని ప్రధాని తెలియజేశారు. ఈ సందేశాన్ని స్మరించుకుంటూ జి-20 శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభిద్దామని మోదీ వ్యాఖ్యానించారు.
21వ శతాబ్దం యావత్ ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశం చేసే సమయం ఆసన్నమైందని, ఇన్నాళ్లుగా ఎదుర్కొంటూ వచ్చిన సవాళ్లకు కొత్త పరిష్కారాలను సూచించాల్సిన సమయమని ప్రధాని మోదీ అన్నారు. మానవ కేంద్రీకృత విధానంతో బాధ్యతలన్నింటినీ నెరవేర్చడం ద్వారా ముందుకు సాగాలని సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. కొవిడ్ -19 తర్వాత ప్రపంచంలో నెలకొన్న పెద్ద సంక్షోభం పరస్పర అపనమ్మకం, విశ్వాసం లోపించడమేనని సూత్రీకరించారు. యుద్ధం ఈ విశ్వాస కొరతను మరింత పెంచిందని అన్నారు.
అయితే ఎక్కడా రష్యా-ఉక్రెయిన్ దేశాల పేర్లను ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడం గమనార్హం. కోవిడ్-19ను యావత్ ప్రపంచం కలసికట్టుగా ఎలా జయించిందో.. ఈ అవిశ్వాస సంక్షోభాన్ని కూడా అలాగే అధిగమించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీ20 అధ్యక్ష స్థానంలో భారతదేశం యావత్ ప్రపంచాన్ని ఏకతాటిపైకి రావాలని ఆహ్వానిస్తోందని, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచవ్యాప్త అపనమ్మకాన్ని గ్లోబల్ ట్రస్ట్‌గా మార్చాలని కోరారు. “ఇది మనమందరం కలిసి నడవాల్సిన సమయం, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే మంత్రం మనందరికీ మార్గదర్శకంగా మారుతుంది.” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
సంక్షోభం అంచున ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఉత్తర-దక్షిణ విభజన కావచ్చు, లేదా తూర్పు మరియు పశ్చిమాల మధ్య దూరం, ఆహారం, ఇంధనం, ఎరువుల నిర్వహణ లేదా ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ లేదా ఆరోగ్యం, శక్తి, నీటి వనరుల భద్రత వంటి సవాళ్లకు వర్తమానంలో మాత్రమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఖచ్చితమైన పరిష్కారాలు సూచించే దిశగా అడుగులు వేయాలని నరేంద్ర మోదీ అన్నారు. ‘సబ్ కా సాథ్’ స్ఫూర్తికి ప్రతీకగా భారత్ చేపట్టిన జీ-20 సదస్సు దేశంలోనూ, దేశం వెలుపలా చేరికకు చిహ్నంగా మారిందని అన్నారు. ‘పీపుల్స్ జీ-20’గా మారిందని, లక్షలాది మంది భారతీయులు ఇందులో నిమగ్నమయ్యారని తెలిపారు.
దేశవ్యాప్తంగా 60కి పైగా నగరాల్లో 200కు పైగా సమావేశాలు జరిగాయని వెల్లడించారు. ‘సబ్ కా సాథ్’ స్ఫూర్తితోనే జీ-20లో ఆఫ్రికన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ ప్రతిపాదించిందని మోదీ అన్నారు. ఈ ప్రతిపాదనతో అందరూ ఏకీభవిస్తారని తాను నమ్ముతున్నట్టు ఆయన ప్రకటించారు. అందరి సమ్మతితో తదుపరి కార్యక్రమం చేపట్టే ముందు, ఆఫ్రికన్ యూనియన్ చైర్‌పర్సన్‌ను జీ-20లో శాశ్వత సభ్యులుగా తమ స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా మోదీ ఆహ్వానించారు.