Tuesday, November 26, 2024

స్టూడెంట్స్ కు సరిపడా ఉపాధ్యాయులు లేరు.. ఏపీ విద్యాశాఖలో వింత పోకడలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగంలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న పురపాలక పాఠశాలల స్థితిగతులను పట్టించుకునే నాథుడే లేరు. ఫలితాలతోపాటు అడ్మిషన్లకూ కార్పొరేట్‌, ప్రైవేటుకు దీటుగా మున్సిపల్‌ పాఠశాలలు పని చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 335 పురపాలక పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి చూస్తే.. ఒక్కో అధ్యాపకుడు ఒకే సమయంలో రెండు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు విజయవాడలోని ఏకేటీపీ మున్సిపల్‌ స్కూల్‌లో 1800 మంది వరకు విద్యార్థులు ఉండగా.. వారందరికీ కలిపి 16 నుంచి 18 తరగతి గదులే అందుబాటులో ఉన్నాయి. అలాగే మంగళగిరిలోని పాఠశాలలో 1150 మంది స్టూడెంట్లు ఉంటే 11 మందే టీచర్లున్నారు. చాలా చోట్ల ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1: 100కుపైగా ఉండటంతో తీవ్ర ఒత్తిడి పడుతోంది.

విద్యా వలంటీర్ల నియామకాలేవి?

మున్సిపల్‌ స్కూల్స్‌లో దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఉపాధ్యాయుల భర్తీ పూర్తిస్థాయిలో జరిగిన దాఖలాలు లేవు. ఒకవైపు బోధన బాగుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను మున్సిపల్‌ స్కూల్స్‌లో చేర్చేందుకు క్యూలు కడుతున్నారు. దీంతో గతేడాది కన్నా ఒక్కో పాఠశాలలో కనీసం వంద వరకు అదనపు అడ్మిషన్లు జరిగాయి. కానీ అదే సమయంలో బోధనా సిబ్బంది లేక, విద్యార్థులకు తరగతులు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది టీచర్ల భర్తీ చేయకున్నా.. విద్యా వలంటీర్లను నియమిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ఉత్తర్వులు ఇచ్చిన కొద్ది రోజుల్లోనే వాటిని వెనక్కు తీసుకున్నారు. దీంతో విద్యా వలంటీర్ల నియామకం కూడా జరగలేదు. శాశ్వత ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించకున్నా.. కనీసం తక్కువ వేతనాలకు వలంటీర్లను అయినా తీసుకుంటే బోధనకు ఇబ్బంది లేకుండా చూడవచ్చని మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌. రామకృష్ణ చెబుతున్నారు.

2400పైగా ఖాళీలు..

రాష్ట్రవ్యాప్తంగా పురపాలక పాఠశాలల్లో 2400 కుపైగా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి వీటి భర్తీ జరరగకపోవడంతో పదవీ విరమణ చేసే వారితో ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. మరోవైపు పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటంతో, ఉన్న సిబ్బందే బోధనావసరాలు తీర్చడంలో సతమతమవుతున్నారు. ప్రతి పాఠశాలలో 400 నుంచి ఐదొందల మంది కనీసం, అత్యధికంగా 1400 నుంచి 1500 మంది వరకు విద్యార్థులు ఉన్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఉన్న టీచర్ల సంఖ్య మాత్రం 14 వేల మందే ఏళ్లుగా కొనసాగుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో 50 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ అయినా టీచింగ్‌ సిబ్బంది, తరగతి గదులు, మౌలిక వసతులు పెరగడం లేదు. కర్నూలులో ఒక హైస్కూల్‌లో అయితే పూర్తి స్థాయిలో డెప్యుటేషన్‌ మీదే నడుస్తున్న పరిస్థితి ఉంది.

- Advertisement -

పర్యవేక్షణ ప్రశ్నే లేదు..

పాఠశాల విద్యాశాఖలో మండల విద్యాశాఖాధికారులు, డీవైఈవోలు ఉండగా.. మున్సిపల్‌లో బోధనా సిబ్బందే సూపర్‌వైజర్లుగా కొనసాగేవారు. ఇటీవల మున్సిపల్‌ స్కూళ్ల పాలనను విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావడంతో సూపర్‌వైజర్లు తిరిగి బోధనా విధుల్లో చేరారు. ఇదిలా ఉంటే ఎంఈవోల సంఖ్య కూడా తక్కువ ఉండటంతో ఒక్కొక్కరు రెండు మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. అంటే దాదాపు అన్ని యాజమాన్యాల పాఠశాలలు కలిపి 200కుపైగా వారి పరిధిలో ఉంటాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ స్కూళ్ల ఆలనా పాలనా, పర్యవేక్షణ జరిపే వారే లేకుండా పోయారు. ఇంగ్లిష్‌ మీడియం బోధనలో కాని, పోటీ పరీక్షల్లో కానీ, ఏటా ఫలితాల్లో కానీ మెరుగైన పనితీరు కనబరుస్తున్న మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా వలంటీర్లు, పర్యవేక్షణాధికారులను నియమించాలని ఎంటీఎఫ్‌ అధ్యక్షుడు రామకృష్ణ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement