న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయిన పనులు ఇపుడు చేస్తామనంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు డా. లక్ష్మణ్ అన్నారు. శనివారం ఢిల్లీలోని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు, రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్నచోటనే అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్, తెలంగాణలో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారానే తెలంగాణ రైతులకు, నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన సూత్రీకరించారు. టీఆరెస్‌తో పొత్తుల చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని తప్ప టీఆరెస్‌తో తమ పార్టీ ఏనాడూ పొత్తు పెట్టుకోలేదని, భవిష్యత్తులోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓటేసినా టీఆరెస్‌కు వేసినా ఒక్కటేనని డా. లక్ష్మణ్ అన్నారు. గెలిచినవాళ్లంతా మూకుమ్మడిగా టీఆరెస్‌లో చేరటం ఖాయమని అన్నారు. రాహుల్ సభలు వృధా ప్రయాస అంటూ ఎద్దేవా చేసిన డా. లక్ష్మణ్, గెలిపించిన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్, టీఆరెస్ ఒక గూటి పక్షులేనని అన్నారు. ఎన్నికల ముందో, ఎన్నికల తర్వాతో కలుస్తారని జోస్యం చెప్పారు.
రోజురోజుకూ బలమైన శక్తిగా ఎదుగుతున్న బీజేపీని ఎదుర్కునేందుకు కాంగ్రెస్, టీఆరెస్, మజ్లీస్‌లు ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ప్రయోగించి టార్గెట్ చేస్తోందన్న విమర్శలకు స్పందిస్తూ.. రాజ్యాంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని, ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్ట రీత్యా ఆయా సంస్థలు చర్యలు తీసుకుంటాయని వివరణ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..