Thursday, November 21, 2024

ఫిర్యాదులు కాదు, నివేదికలే ఇచ్చా : తమిళిసై ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తాను కేంద్రానికి ఇచ్చేవి నివేదికలే తప్ప ఫిర్యాదులు కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వెల్లడించారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నివాసంలో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆమె, తిరిగివెళ్లే ముందు సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ తెలంగాణ భవన్‌లో తెలుగు మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కేంద్రానికి ఫిర్యాదు చేశానంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు. ప్రతి గవర్నర్ ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులపై కేంద్రానికి నివేదికలు అందజేస్తుంటారని, తాను కూడా అలాగే నివేదికలు సమర్పిస్తానని వివరణ ఇచ్చారు. ఆ నివేదికల్లో అన్ని అంశాలూ ప్రస్తావిస్తూ ఉంటానని అన్నారు. తానిచ్చిన నివేదికపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే తాను చెప్పలేనని, అయితే కేంద్రం మౌనంగా ఉందని మాత్రం అనుకోవద్దని ఆమె చెప్పారు. అలాగని రాజ్యాంగ పరిధిలో ఏదైనా చర్య చేపడితే ప్రజాస్వామ్యానికి విఘాతమంటూ విమర్శలు చేస్తారని ఆమె అన్నారు.

కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి విబేధాలు.. నన్ను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా చూస్తున్నారు..

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో విబేధించిన విషయం అందరికీ తెలిసిందేనని, అయితే తనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే చూస్తోందని తమిళిసై అన్నారు. తాను గతంలో బీజేపీ నేతగా పనిచేసినంత మాత్రాన ఇప్పుడు కూడా ఆ పార్టీ నేతగా పేర్కొనడం తగదన్నారు. ఏ రాష్ట్రంలోనైనా గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విబేధాలొస్తే.. వాటిని వ్యక్తిగతంగా తీసుకోరని, కానీ తెలంగాణలో తనను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వం విబేధించినప్పటికీ, వ్యక్తిగతంగా గవర్నర్‌పై ఎలాంటి వ్యతిరేకత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా సభలోనే వ్యాఖ్యానించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మాత్రం వ్యక్తిగతంగా విమర్శిస్తూ, సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని తమిళిసై తెలిపారు. చివరకు ఆ ట్రోలింగ్‌ను గమనించిన ప్రజలే “ఒక గవర్నర్‌గా కాకపోయినా, ఒక మహిళను ఇలా అవమానిస్తారా” అంటూ స్పందిస్తున్నారని తమిళిసై వ్యాఖ్యానించారు. తాను తమిళిసైకి గౌరవమివ్వాలని చెప్పడం లేదని, గవర్నర్ పదవిని, కార్యాలయాన్ని గౌరవించాలని మాత్రమే చెబుతున్నానని అన్నారు. ఈరోజు తానుండవచ్చు, రేపు ఇంకెవరైనా రావచ్చు. ఇవాళ కేసీఆర్ సీఎంగా ఉండవచ్చు. రేపు మరొకరు ఉండవచ్చు. కానీ ఏ పదవికి ఇవ్వాల్సిన గౌరవం ఆ పదవికి ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. గవర్నర్ పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని నొక్కి చెప్పారు. సర్పంచ్ పదవైనా, గవర్నర్ పదవైనా.. వ్యవస్థల్ని మనం గౌరవించాల్సిందేనని తమిళిసై వ్యాఖ్యానించారు. తానెప్పుడూ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తుంటాను తప్ప, ఇలాంటి ప్రొటోకాల్ గురించి పెద్దగా పట్టించుకోనని అన్నారు. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లినప్పుడు సైతం కనీసం భద్రతాపరమైన ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని తమిళిసై అన్నారు.

ప్రజల్ని కలిస్తే తప్పేంటి?

ప్రజా జీవితంలో ఉన్న తాను ప్రజలకు సాయం అందించేందుకు ఎప్పుడూ ముందుంటానని, ఈ క్రమంలో ప్రజలు అర్జీ పట్టుకుని తన దగ్గరకొస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. తనకు అర్జీ పెట్టుకున్న ప్రజల్లో 40 మందికి వైద్యం అందిందని, ఈ పని ఎవరు చేసినా సరే మెచ్చుకోవాలి తప్ప తప్పుబడితే ఎలా ఆమె అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం ఆలయానికి, అక్కడి గిరిజన ప్రాంతాలకు రైలు ప్రయాణం చేసి వెళ్లానని, ఈ పర్యటన బాగా జరిగిందని సంతోషం వ్యక్త చేశారు. షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజల బాగోగులపై గవర్నర్ నేరుగా జోక్యం చేసుకునే వెసులుబాటు రాజ్యాంగమే కల్పించిందని ఆమె తెలిపారు. తాను ఇప్పటికే 6 ఆదివాసీ-గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నానని, అక్కడ వైద్య సదుపాయాలు మెరుగుపర్చేలా కృషి చేస్తున్నానని తెలిపారు. గవర్నర్‌గా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని ఆమె పునరుద్ఘాటించారు. నెలలో 7 రోజుల పాటు సెలవు తీసుకునే వెసులుబాటు ఉన్నా సరే, తాను ఒక్క రోజు కూడా సెలవు లేకుండా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నానని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రజల్ని కలుస్తూనే ఉంటానని, అదే తనన తత్వమని, ఎవరికైనా నచ్చకపోతే అది తన తప్పు కాదని తెలిపారు. తన పనితీరు నచ్చడం వల్లనే మరో రాష్ట్రం బాధ్యతల్ని అదనంగా అప్పగించారని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ నేతల ఫిర్యాదును సంబంధిత వర్గాలకు పంపించా

తన వద్దకు ఎవరు ఏ ఫిర్యాదు తీసుకొచ్చినా, సంబంధిత శాఖలకు పంపిస్తుంటానని గవర్నర్ తమిళిసై తెలిపారు. ప్రజలు లేదా పార్టీలు తీసుకొచ్చే ఫిర్యాదులు తీసుకుని పక్కన పడేయడం సమంజసం కాదు కదా అని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును సంబంధిత వర్గాలకు పంపించానని ఆమె స్పష్టం చేశారు.

నాకు రాష్ట్రపతి, ప్రధాని మద్ధతు ఉంది

రాష్ట్ర ప్రభుత్వంతో నెలకొన్న విబేధాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మద్ధతుందా అన్న ఆంధ్రప్రభ ప్రతినిధి ప్రశ్నకు బదులిస్తూ.. తనకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహా తనపై ఉన్న అందరి మద్ధతు ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. తాను బాగా పనిచేస్తానన్న నమ్మకం వారందరికీ ఉందని, అందుకే తాను శక్తిమంతంగా ముందుకెళ్తున్నానని తెలిపారు. తానిచ్చే నివేదికలపై కేంద్రం ఏం చేయాలో అది చేస్తుందని, ఆ వివరాలు తాను బయటపెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న అఖిల భారత సర్వీసు అధికారుల విషయంలో కేంద్రం ఏం చేయాలో అదే చేస్తుందని ఆమె అన్నారు. ఇకపోతే రాష్ట్రపతి, ఉప రాష్ర్టపతి రేసులో ఉన్నారా అని ప్రశ్నించగా, తాను ఇలాంటివాటిపై స్పందించలేనని అన్నారు. అయితే తానెప్పుడూ ప్రజలకు, దేశానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటానన్నారు. తన తలకు రాయి తగిలి రక్తం కారుతున్నా వెనకకడుగు వేయనని, తాను నెరవేర్చాల్సిన బాధ్యతలను నెరవేర్చుతానని తమిళిసై వ్యాఖ్యానించారు. మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషితో పోల్చడాన్ని గురించి ప్రస్తావించగా, ఆ విషయం తన దృష్టికొచ్చిందని, అయితే తాను ప్రజలకు సేవ చేయడం కోసమే వైద్యవృత్తిని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయడం కోసం కాదని స్పష్టం చేశారు. వైద్యురాలిగా ఆనాడు ఫీటల్ స్పెషలిస్టుగా ఎంతో పేరు గడించానని, వైద్య రంగంలో ఉన్నత దశలో ఉండగా ఆ వృత్తిని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి పోరాటాలు చేశానని గుర్తుచేసుకున్నారు. వైద్యురాలిగా, రాజకీయ నాయకురాలిగా, గవర్నర్‌గా ఎక్కడున్నా సరే, తాను ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు. ఒక మహిళగా మగవారితో పోలిస్తే ఎక్కువ సమస్యల్నే ఎదుర్కోవాల్సి ఉంటుందని, అయితే మహిళలు మాత్రం మానసికంగా బలంగా ఉండాలని ఆమె సూచించారు. కన్విక్షన్, కరేజ్, కమిట్‌మెంట్ – (3C) సూత్రాన్ని అనుసరిస్తూ మహిళలు ముందుకెళ్లాలని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement