న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుకు ప్రజలు వీఆర్ఎస్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ రెడ్డి, మాయమాటలతో తెలంగాణ ప్రజలను 8 సంవత్సరాలుగా కేసీఆర్ మోసగిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళ్లలో పాటించే బీజేపీ వైపు తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని ఆయనన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరవడమే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
కేసీఆర్, టీఆర్ఎస్ మాయమాటలకు లొంగకుండా ప్రజలు బీజేపీని ఓ ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని, జనాదరణకు బహిరంగ సభ విజయవంతం కావడమే నిదర్శనమని అన్నారు. కించపరిస్తూ, అగౌరవపరుస్తూ మాట్లాడే కేసీఆర్ వైఖరిని తెలంగాణ ప్రజలు ఈసడించుకుంటున్నారని నారాయణ రెడ్డి తెలిపారు. ప్రధాన మంత్రి తెలంగాణ పర్యటనల సందర్భంగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి, కుంభకోణాలపై దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని గూడూరు నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. హామీలను అమలు చేయకుండా మోసగిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో చేస్తున్న కేసీఆర్ ప్రయత్నాలు చివరకు ఆయనకు వీఆర్ఎస్ ప్రకటించే దశకు తీసుకొస్తాయని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.