న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అంటున్న ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర రావు ఇక వీఆర్ఎస్ (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) తీసుకోవాల్సిందేనని బీజేపీ నేత, తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల కో-ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఓర్వలేకపోతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, కార్యవర్గ నేతలు హాజరవుతున్నారని, నగరం మొత్తం కాషాయమయం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ రోజురోజుకూ బలహీనపడుతోందని అన్నారు.
మరోవైపు రాష్ట్రపతి అభ్యర్థిగా మారుమూల గ్రామానికి చెందిన గిరిజన-ఆదివాసీ మహిళను ఎంపిక చేస్తే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని పొంగులేటి అన్నారు. గిరిజన మహిళను రబ్బర్ స్టాంపుతో పోల్చి అవమానించారని, వారంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని ఆయన తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసుపై జరుగుతున్న చర్చ నుంచి దృష్టిమళ్లించడం కోసమే అగ్నిపథ్ పథకంపై అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ గందరగోళపరుస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ప్రోద్భలంతోనే హైదరాబాద్ నగరంలో అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలు, హింస చోటుచేసుకుందని ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.