Tuesday, November 26, 2024

Delhi | విగ్రహం కాదు, రాజ్యాధికారం కావాలి: కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రజలను మోసం చేయడానికే సీఎం కేసీఆర్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఅర్ మోదీతో పోటీ పడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తమకు విగ్రహం కాదు, రాజ్యాధికారం కావాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు అప్పులతో దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తనను చంపాలని చూస్తున్నారని, పీస్ మిషన్‌ను ఆపేశారని ఆయన ఆరోపించారు.

దేశంలో ఎక్కడే ఆపద వచ్చినా గతంలో తాను ముందున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనడానికి ముందుకొచ్చిన కేసీఆర్, వేలానికి పెట్టిన సింగరేణి బ్లాకులను ఎందుకు కొనలేదంటూ కేఏ పాల్ ప్రశ్నించారు. ఒకప్పుడు ఆంధ్రులను కుక్కలు, నక్కలని తిట్టి ఇప్పుడు పొగుడుతారా అంటూ నిలదీశారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో హైదరాబాద్‌లో తాను నిర్వహించే గ్లోబల్ పీస్ సభకు అనేక మంది రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ సదస్సు ద్వారా తెలుగు రాష్ట్రాల గ్రామాలకు మేలు జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement