Saturday, November 23, 2024

ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష..

సియోల్‌, ప్ర‌భ‌న్యూస్ : ఉత్తర కొరియా బుధవారం నాడు బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించినట్లు దక్షిణ కొరియా సైనికాధికారులు తెలియజేశారు. ఈ క్షిపణి తూర్పు తీరం వైపు దూసుకెళ్లిందని వారు తెలిపారు. సాధ్యమైనంత వేగంగా అణ్వస్త్రాలు సంపాదించుకుంటామని కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రకటించిన వారంలోగానే ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ క్షిపణి 780 కిలోమీటర్ల ఎత్తులో 470 కిలోమీటర్లు ప్రయాణించిందనీ, శబ్దవేగం కన్నా 11 రెట్ల వేగంతో దూసుకెళ్లిందని దక్షిణ కొరియా సైనికాధికారులు తెలియజేశారు. ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన 11వ క్షిపణి పరీక్ష ఇది. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైన యూన్‌ సుక్‌ యేల్‌ పదవీస్వీకారానికి వారం రోజుల ముందు ఉత్తర కొరియా పక్కా ప్రణాళికతో ఈ ప్రయోగం నిర్వహించింది.

ఉత్తర కొరియా గత నెలలోనే ఖండాంతర క్షిపణిని పరీక్షించి అంతర్జాతీయ సమాజాన్ని కలవరానికి గురిచేసింది. నిజానికి 2017 తరువాత ఉత్తర కొరియా ఈ తరహా క్షిపణుల పరీక్షలు నిర్వహించలేదు. తాజా పరీక్షలు పొరుగు దేశాలపైనా, అమెరికాపైనా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతున్నాయని నిపుణులు అంటున్నారు. ప్యాంగ్‌యాంగ్‌ తక్షణమే ఈ క్షిపణి పరీక్షలు నిలిపివేయాలని దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ డిమాండ్‌ చేశారు. కొరియా ద్వీపకల్పానికి, పొరుగు దేశాలకు ప్రమాదకరమైన ఈ క్షిపణి పరీక్షలు భద్రతామండలి తీర్మానాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement