ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కాశ్మీర్ నుంచి హిమాచల్ వరకు అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సున్నాకు పడిపోయాయి. ఎత్తైన ప్రాంతాల్లో చలిగాలుల కారణంగా మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. రాజస్థాన్ చురులో ఉష్ణోగ్రత 5 డిగ్రీలుగా నమోదైంది. ఢిల్లి ఇప్పటికే కఠినమైన శీతాకాలాన్ని ఎదుర్కొంటున్నది. ముంబైలో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తున్నది.ఈ రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువ మైనస్ 3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నది.
వచ్చే వారం నుంచి చలి మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మాండస్ తుఫాన్ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లోనూ వాతావరణం మారిపోయింది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలుచోట్ల వానలు కురుస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ జోన్‌కి చేరింది. శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.