Sunday, November 3, 2024

Delhi | ఈశాన్య రాష్ట్రాల మంత్రి హైదరాబాద్‌లో రాజకీయాలు.. మణిపూర్ ఘటనపై ఎంపీ బడుగుల ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మణిపూర్‌లో మారణహోమం జరుగుతుంటే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో రాజకీయాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మణిపూర్ సహా దేశవ్యాప్తంగా అనేక సమస్యల మీద పార్లమెంట్‌లో చర్చించాలని రెండురోజులుగా ఇరుసభల్లో వాయిదా తీర్మానాలు ఇస్తున్నామని లింగయ్య యాదవ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో మాట్లాడని డిమాండ్ చేశామన్నారు.

ప్రధాని ప్రసంగించకపోగా, వాయిదా తీర్మానాల మీదా చర్చ జరపని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు. ఓవైపు మణిపూర్‌లో మారణహోమం జరుగుతుంటే ఈశాన్య రాష్ట్రాల మంత్రి కిషన్‌రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పరిశీలించటానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని డ్రామాలు చేస్తున్నారని ఎంపీ లింగయ్య విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పక్కన పెట్టి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన పేరుతో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా ఆయన హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం అయినా పార్లమెంట్ సమావేశాలలో కిషన్ రెడ్డి పాల్గొనాలని డిమాండ్ చేశారు. ప్రధానితో చర్చించి మణిపూర్ మంటల్ని ఆపాలని అన్నారు. దేశ ప్రజలు, రైతుల తరఫున బీఆర్‌ఎస్ ఎప్పుడూ నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు. దేశ ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement