జిల్లాలో ప్రసవాలకు ముహూర్తాలు పెట్టడం పురోహితులు నిలిపివేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. సాధారణ ప్రసవాలు పెంపుకు తీసుకోవాల్సిన చర్యల పై కలెక్టర్ గైనకాలజిస్టులు, జిల్లాలోని పురోహితులతో కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, వైద్యంలో చాలా రంగాల్లో దేశంలో మెరుగైన స్థానంలో తెలంగాణ ఉందని కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక తీర ఆపరేషన్లు జరగడం బాధాకరమని కలెక్టర్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ప్రపంచంలోనే అత్యధికంగా 90% పైగా సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.సిజేరియన్ ఆపరేషన్ ను నిర్వహించడం వల్ల ల బిడ్డ ఆరోగ్యానికి చాలా నష్టం వాటిల్లుతుందని, శిశువులు ముర్రెపాల కు దూరం అవుతున్నారని కలెక్టర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు 2620 ప్రసవాలు జరిగితే వాటిలో 91.6% అంటే 2400 శస్త్ర చికిత్సలు, 220 సాధారణ ప్రసవాలు జరగడం ఆందోళనకరమని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. శస్త్రచికిత్సల ద్వారా జరిగే ప్రసవాలను 50% కంటే తగ్గించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని, దీనికి పురోహితులు తమ వంతు సహకారం అందజేయాలని కలెక్టర్ కోరారు.సిజేరియన్ ఆపరేషన్ ల పెరుగుదలకు ప్రసవాలకు ముహూర్తాలు నిర్ణయించడం సైతం ఒక కారణమని గమనించామని , ముహూర్తపు ప్రసవాల జన్మ గడియలు దైవ నిర్ణయం కావని, ప్రకృతి విరుద్ధమని ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు.జిల్లాలో ఇక పురోహితులు ప్రసవాలకు ముహూర్తాలు పెట్టవద్దని, దీనిని సూచిస్తూ ప్రతి ఆలయంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు.
పురోహితులకు సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు ఉన్నాయని, పురోహితుల మాటలను చాలామంది పాటిస్తారని , కావున శస్త్రచికిత్స ప్రసవాల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు పురోహితులు సైతం వివరించాలని కలెక్టర్ కోరారు. సాధారణ ప్రసవాల వల్ల తల్లి బిడ్డ ఇన్ఫెక్షన్ ప్రమాదం తగ్గిపోతుందని, మొదటి గంటలో తల్లి ముర్రె పాలు శిశువుకు పట్టించడంవల్ల పిల్లవాడు ఎదుగుదల పెరుగుతుందని, తల్లికి ఆరోగ్య సమస్యలు ఉండవని, ఆర్థిక భారం సైతం చాలా తగ్గిపోతుందని కలెక్టర్ తెలిపారు. సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ప్రసవ నొప్పులు భరించలేని వారికి శస్త్రచికిత్స ద్వారా కాన్పులు చేయడం సహజం కాదని, శస్త్ర చికిత్స కేవలం ప్రాణాపాయ స్థితిలో మాత్రమే నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలోని వైద్యులు, పురోహితులు, సంఘ పెద్దలు మహిళలు గర్భం దాల్చి రిజిస్ట్రేషన్ ప్రారంభం నుంచి సాధారణ డెలివరీ కోసం అవగాహన కల్పిస్తూ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డి.సి.హెచ్. ఎస్.డాక్టర్ మందల వాసుదేవరెడ్డి, గైనకాలజిస్ట్ లు డా.లీలావతి, డా.విజయ,జిల్లాలోని గైనకాలజిస్టులు, పురోహితులు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.