ఈ వానకాలంలో దేశవ్యాప్తంగా వర్షాలు బాగానే కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి ఐఎండీ తన రెండో దీర్ఘకాలిక అంచనాలను మంగళవారం వెలువరించింది. మధ్యభారతంలో సాధారణం కన్నా ఎక్కువగా, తూర్పు రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం సాధారణంకన్నా తక్కువ వర్షపాతం ఉంటుందని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల వారీగా చూస్తే రుతుపవనాల విషయంలో కొంత తేడాలున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా ఈసారి మంచి వర్షపాతమే నమోదవుతుందని ఆశిస్తున్నామని, ఇది వ్యవసాయరంగానికి సహాయకారిగా ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు.
‘జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కొనసాగే రుతుపవనాల సీజన్‌లో.. దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ) వర్షపాతంతో పోల్చితే ఈసారి 101 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది నాలుగు పాయింట్లు ఎక్కువగానీ, తక్కువగానీ ఉండవచ్చు’ అని చెప్పారు. ఎల్‌పీఏ 96-104ను సాధారణ వర్షపాతంగా వర్గీకరిస్తుంటారు. వాస్తవానికి ఈ ఏడాది నైరుతి రుతుపవనాల తొలి దీర్ఘకాలిక అంచనాలను ఐఎండీ వెలువరించినప్పుడు ఎల్‌పీఏలో 98 శాతం వర్షపాతం మాత్రమే నమోదవుతుందని పేర్కొంది. కానీ, ప్రస్తుతం దానిని 101 శాతానికి పెంచటం విశేషం. ఇందులోనూ దక్షిణ భారతంలో ఈ అంచనాలు మరింత అధికంగా ఉన్నాయి. దాదాపు 93-107 శాతం వరకూ వర్షపాతం నమోదు కావచ్చని ఐఎండీ పేర్కొంది.