యాదాద్రి, ప్రభన్యూస్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ లో సాధారణ ప్రసవాలు పెంచాలని, సిజేరియన్ ఆపరేషన్ లను తగ్గించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్ వైద్యులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ వైద్యులతో గర్భిణీల సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ఆపరేషన్లను ఆసుపత్రుల వారీగా ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలని, సాధారణ ప్రసవాలు పెరిగేలా ఆసుపత్రులలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి సిజేరియన్ ఆపరేషన్లకు సంబంధించి ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని, సాధారణ ప్రసవం అయ్యే సమయంలో కూడా సిజేరియన్ నిర్వహించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లో గర్భిణీ స్త్రీలకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే లాభాలు, సిజేరియన్ ఆపరేషన్ల వలన కలిగే దుష్పరిణామాలు అవగాహన కలిగేలా పోస్టర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలను పెంచే విషయంలో అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బందికి దక్షత స్కిల్ ట్రైనింగ్ శిక్షణ అందిస్తామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..