Tuesday, November 26, 2024

జగన్ జాబ్ క్యాలెండర్ కంటే మాములు క్యాలెండర్ బెటర్: అచ్చెన్నాయుడు

సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కంటే మార్కెట్‌లో దొరికే మాములు క్యాలెండర్ బెటర్ అని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. మాములు క్యాలెండర్‌లో కనీసం రాశిఫలాలు అయినా చూసుకోవచ్చన్నారు. సీఎం జగన్ జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో చీటింగ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారని విమర్శించారు. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని రెండేళ్లు కాలయాపన చేశారని ఆరోపించారు. 2.30 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కనీసం 30 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒక్క పోలీసు శాఖలోనే 7 వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 470 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం వింతగా ఉందన్నారు. 25 వేల డీఎస్సీ టీచర్ల పోస్టులు ఉంటే వాటి గురించి అసలు క్యాలెండర్‌లో ప్రస్తావించలేదన్నారు. మద్యం అమ్మేవారివి కూడా ఉద్యోగాలేనా? అంటూ ఎద్దేవా చేశారు. కోవిడ్ సమయంలో 3 నెలలు పని చేసేందుకు కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్న నర్సు పోస్టులను కూడా క్యాలెండర్‌లో పెట్టారు కానీ కృష్ణపట్నం ఆనందయ్యకు డాక్టర్ పోస్టు ఇచ్చామని ఆయన ఆశ్రమంలో ఉన్నవారికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన 6 లక్షల ఉద్యోగాల జాబ్‌ క్యాలెండర్‌ పచ్చి బూటకమని ఆ పార్టీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు విమర్శించారు. 51 వేల మంది ఆర్‌టిసి ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే చూపారని తెలిపారు. ఉద్యోగులకు ఇస్తామన్న ఐఆర్‌, పీఆర్సీలపై సీఎం ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement