Friday, November 22, 2024

Follow up : సాధారణ ప్రసవాలు పెరగాలి.. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి: మంత్రి హరీశ్​రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెరగాలని, సీ-సెక్షన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని అధికారులను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. గతంలో సీజేరియన్లు చేస్తే ప్రోత్సహాకాలు ఇచ్చేవారు కాదని, కాని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రోత్సహకాలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. నర్సుల నుంచి వైద్యుల వరకు ఈ ప్రోత్సాహం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, ప్రతి గర్భిణికి నాలుగుసార్లు తప్పకుండా ఏఎన్‌సీ పరీక్ష చేసి, వివరాలు నమోదు చేయాలన్నారు. రక్తహీ నతతో బాధపడుతున్న గర్భిణుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నిర్దేశించారు. గర్భిణీని ఆసుపత్రికి తీసుకువచ్చే ఆశా, ఏఎన్‌ఎం కోసం సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా, మెడికల్‌ కాలేజీ ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సమష్టి కృషితో మంచి ఫలితాలు వస్తున్నాయని, గడిచిన ఏడాదిలో సీజేరియన్ల శాతం ఆరుదాకా తగ్గిందన్నారు. తెలంగాణ ఏర్పడేనాటికి 33శాతం ప్రసవాలు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదయ్యేవని, ఇప్పుడు ఆశాతం 66కు పెరిగిందని ప్రశంసించారు. అనవసర సిజేరియన్లు తగ్గించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలశాతం మరింత పెరిగేలా కృషి చేయాలన్నారు.

సీఎం కేసీఆర్‌ వైద్య, ఆరోగ్యరంగాన్ని పటిష్టం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారని, సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వైద్య, ఆరోగ్యశాఖకు పిలుపునిచ్చారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 43 పీహెచ్‌సీలకు కొత్త భవనాలు మంజూరు చేశామన్నారు. 67కోట్ల 6లక్షలతో నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 372 పీహెచ్‌సీల మరమ్మతులను 43కోట్ల 18లక్షలతో చేపట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1497 సబ్‌ సెంటర్లను ఒక్కోదానికి 4లక్షల చొప్పున 59కోట్ల 88లక్షలతో మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్ల నిర్మాణం, మరమ్మతుల విషయంలో పూర్తి బాధ్యత డీఎంహెచ్‌వో, మెడికల్‌ ఆఫసర్లదేనని స్పష్టం చేశారు. మరమ్మతుల సమయంలో వేరే చోట్ల ఆసుపత్రి నిర్వహణకు ప్రత్యామ్న్యాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి నిర్మాణం, మరమ్మతుల సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. మెరుగైన పనితీరు కనబరిచేందుకు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు 720 పీహెచ్‌సీలలో ఇంటర్నెట్‌ సదుపాయంతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పీహెచ్‌సీ నుంచి సూపర్‌ స్పెషాలిటీ సేవల వరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అత్యల్పంగా ఓపీ నమోదవుతున్న జిల్లాల్లోని ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మిజిల్స్‌ అండ్‌ రుబెల్లా (తట్టు, అమ్మవారు) వ్యాధులను 2025 నాటికి రూపుమపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ తరహా కేసులు వెంటనే గుర్తించి చికిత్స అందించాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం (ఐహెచ్‌ఐపీ)లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, ఈ ప్రక్రియను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం తగదన్నారు. చలికాలం నేపథ్యంలో జ్వరం, జలుబు, గొంతునొప్పి, చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీ స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించామని, ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగాలని స్పష్టం చేశారు. ఓపీ మరింత పెరగాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ ద్వారా రోగ నిర్ధారణా పరీక్షలు నిర్వహించి, వీలైనంత త్వరగా ఫలితాలు ఇచ్చి, చికిత్స అందించేందుకు కృషి చేయాలన్నారు. రోజువారీ శాంపిళ్ల సంఖ్య పెంచాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement