Thursday, November 21, 2024

రూపాయి నాణేలతో నామినేషన్‌ ధరావతు.. పేదల గుడిసెలు కూల్చిన బీజేపీపై పోటీకి సామాన్యుడు

గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికల బరిలోకి దిగిన ఓ కూలీ, నామినేషన్‌ డిపాజిట్‌ను రూపాయి నాణేల రూపంలో చెల్లించాడు. గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌ సమీపంలో మురికివాడలో నివాసం ఉండే మహేంద్ర పట్నీతోపాటు ఇతరుల గుడిసెలను అధికారులు గతంలో రెండు సార్లు కూల్చివేశారు. 2010లో దండి కుటీర్‌ మ్యూజియం నిర్మాణం కోసం ఒకసారి, 2019లో హోటల్‌ నిర్మాణం కోసం మరొకసారి ఖాళీ చేయించారు. దీంతో నిరాశ్రయులైన 521 మంది నివాసితులు హోటల్‌ సమీపంలోని ప్రాంతంలో తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్‌ కనెక్షన్‌ లేక ఇబ్బందులు పడుతున్నారు.

చిన్న వ్యాపారాలు, రోజువారీ కూలీ పనులు చేసుకునే వారంతా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. కాగా, ఎన్నికలకు ముందు కనిపించి హామీలు ఇచ్చే నేతలు ఆ తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తమ తరుఫున ప్రతినిధిగా ఉన్న మహేవ‌ద్ర పట్నీని గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికల్లో పోటీకి నిలబెట్టారు. అంతా కలిసి పది వేల వరకు రూపాయి నాణేల్లో సేకరించారు. గాంధీనగర్‌ నార్త్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేంద్రకు ఆ డబ్బును ఇచ్చారు. దీంతో గత వారం సెక్యూరిటీ డిపాజిట్‌గా ఎన్నికల అధికారులకు ఆయన చెల్లించాడు. శాశ్వత నివాసంతోపాటు అధికారుల వేధింపులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కూలీ అయిన మహేంద్ర తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement