Tuesday, November 26, 2024

TS | ఆన్‌లైన్‌లో నామినేషన్‌ వేయొచ్చు.. ఎన్నికల్లో ఈసీ అధునాతన ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అన్నీ ఆధునిక సాంకేతికలను వినియోగిస్తున్న ఎన్నికల సంఘం ఈ దఫా నామినేషన్ల స్వీకరణలోనూ సరికొత్త పంథానే అనుసరిస్తోంది. శుక్రవారంనుంచి రాష్ట్రంలో నామినేషన్ల పర్వం మొదలుకాగా, తొలిరోజు 100 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజు తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగింది. మొదటి రోజే పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఆన్‌లైన్‌లో నామినేషన్ల స్వీకరణకు సువిధ పోర్టల్‌ ద్వారా ఈసీ చర్యలు తీసుకుంది.

ఇది కొత్త విధానంగా ఈ ఎన్నికల్లోనే అమలులోకిరాగా, నామినేషన్లను సామాన్యులు కూడా పరిశీలించి అభ్యర్ధులు తెలిపిన సమాచారం సరైందా కాదా అని తెలుసుకోవచ్చు. అంతేకాదు.. అవాస్తవాలను పొందుపరిస్తే ప్రజలే ఈసీకి ఫిర్యాదు చేయొచ్చు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆన్‌లైన్‌లో కూడా నామినేషన్‌ దాఖలు చేసుకునే అవకాశాన్ని తొలిసారిగా భారత ఎన్నికల సంఘం కల్పించింది. కోదాడ నియోజక వర్గానికి చెందిన జలగం సుధీర్‌ అమెరికాలో వర్క్‌ పర్మిట్‌పై పనిచేస్తున్నారు.

- Advertisement -

గత కొంత కాలంగా కోదాడ పరిసర ప్రాంతాల్లో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జలగం సుధీర్‌, దీంతో ఆయన అన్‌లైన్‌లో తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఆన్‌లైన్‌లో నామినేషన్‌ దాఖలు చేసేందుకు అవసరమైన ఎలక్షన్‌ కమీషన్‌ నిబంధనల ప్రకారం సంబంధిత అన్ని డాక్యుమెంట్లు అందచేయటానికి సిద్దంగా ఉన్నానని, ఈ ఆన్‌లైన్‌ ప్రాసెస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అందించాలని జలగం సుధీర్‌ కోదాడ ఎన్నికల అధికారులకు లేఖ రాశారు.

సువిధ పోర్టల్‌ ద్వారా ఎన్నికల్లో ఆన్‌లైన్‌ నామినేషన్‌ దాఖలు చేసుకోవచ్చని ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో సువిధ పోర్టల్‌ ద్వారా కోదాడ అసెంబ్లి నియోజకవర్గం నుండి ఆన్‌లైన్‌ ద్వారా స్వతంత్ర అభ్యర్దిగా జలగం సుధీర్‌ తన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ ఎన్నికల అధికారులు ఆమోదిస్తే.. తెలంగాణలో మొట్ట మొదటి ఆన్‌లైన్‌ నామినేషన్‌ కోదాడ నుండే దాఖలు అయినట్లు-గా గుర్తింపు రానుంది.

ఇవే కీలకం….

ఎన్నికలు ఏవైనా… మొదట జరిగే ప్రక్రియ నామినేషన్లు వేయడం. ఎలక్షన్‌ ప్రక్రియలో ఇది అత్యంత కీలకమైనది. నామినేషన్లు ఓకే అయిన అభ్యర్థులే ఎన్నికల బరిలో ఉంటారు. ఈ నామినేషన్లలో అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉండాలి. విద్య, వ్యాపారం, ఆస్తులు, వారసత్వ సంపద, నేరచరిత్ర, కేసులు… ఇలా అన్ని వివరాలు అఫిడవిట్‌లో పొందుపరచాలి. దీన్ని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే.. కొంత మంది అభ్యర్థులు అన్ని వివరాలను పొందుపరచడంలో విఫలమవుతున్నారు.

ఇంకొందరు కావాలనే తప్పుడు వివరాలను నామినేషన్‌ పత్రాల్లో పొందుపరుస్తున్న సందర్బాలున్నాయి. అలాంటి వారు ఉంటే… సామాన్యులు అయినా సరే ఫిర్యాదు చేయొచ్చు. తద్వారా ఎన్నికల ప్రక్రియలో సామాన్యులు కూడా భాగం కావొచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై ఫిర్యాదులు ఉన్నా… వారి నామినేషన్‌ పత్రాల్లో అవకతవకలు ఉన్నా… వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. ఒక అభ్యర్థి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చిన తర్వాత… ఆ పత్రాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎన్నికల సంఘానికి పంపుతారు.

ఆ తర్వాత… రిటర్నింగ్‌ ఆఫీసు ముందు బోర్డుపై అఫిడవిట్‌ను ఉంచుతారు. ఆ ఆఫిడవిట్‌ను ఎవరైనా పరిశీలించవచ్చు. ఒకవేళ అందులో వివరాలు తప్పుగా ఉన్నా… లేక కీలకమైన అంశాలు పొందుపరచకపోయినా.. వెంటనే రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. ఫలానా అభ్యర్థికి సంబంధించిన అఫిడవిట్‌లో పూర్తి వివరాలు లేవనో.. లేక ఇచ్చిన సమాచారం తప్పనో… లిఖితపూర్వకంగా రిటర్నింగ్‌ అధికారికి లేఖ రాస్తే సరిపోతుంది.

దీనికి ప్రకారం సంబంధిత అధికారులు చర్య తీసుకుంటున్నారు. ఇలా తప్పొప్పులను పరిశీలించి ఫిర్యాదుకు అవకాశం ఉంది. గతంలో అనేకమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై తప్పుడు అఫిడవిట్‌ల ఉదంతాలపై కోర్టుల్లో కేసులు వేసిన సంగతి తెలిసిందే. అవి వారి కాలపరిమితి ముగిసేంతవరకు కూడా తేలని ఉదంతాలు కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిలోనే అడ్డుకునేలా ఈసీ ఈ చర్యలకు ఉపక్రమించింది.

నామినేషన్లలో అవకతవకలు ఉన్నాయంటూ… ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరిపై కోర్టు అనర్హత వేటు కూడా వేసింది. ప్రజలే ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యేలు కూడా… నామినేషన్లు సరిగా ఇవ్వలేదన్న కారణంగా.. ఎమ్మెల్యే పదవులు వదలుకోవాల్సి వస్తుంది. గతంలో ఇలా అనేక ఉదంతాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో గద్వాల ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్‌ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది.

నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న కారణంగా కృష్ణమోహన్‌ రెడ్డిపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసింది హైకోర్టు. ఆయన చేతిలో ఓడిపోయిన డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తించాలని ఆదేశించింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇస్తే.. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కనుక.. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో పూర్తి వివరాలు… సరైన వివరాలు ఇవ్వడం చాల ముఖ్యం.

ఏ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో అయినా తప్పులు, అవకతవకలు ఉంటే.. సామాన్యులు కూడా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయొచ్చు. అదేవిధంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కూడా అఫిడవిట్‌ అంశంపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయనకు క్లీన్‌ చీట్‌ లభించింది. ప్రత్యర్ధి సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఇలువంటి ఘనటలు దేశవ్యాప్తంగా అనేకం జరిగాయి. అందుకే వినూత్నంగా ఆలోచించిన ఈసీ సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement