మొబైల్ వచ్చిన కొత్తలో నోకియా ఫోన్ బ్రాండ్ ఎంత పాపులార్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ వేర్లో వచ్చిన మార్పులు, నోకియా ప్రపంచానికి తగిన విధంగా పోటీ పడలేకపోవడంతో సంస్థ కనుమరుగైంది. కానీ ఈ సంస్థ నుంచి వచ్చే ఉత్పత్తులు అంటే వినియోగదారులకు ఒక నమ్మకం. మన దేశంలో మరే ఇతర బ్రాండ్ కూడా ఆ రేంజ్లో పాపులర్ కాలేదు. అయితే ఈ సంస్థ ఇప్పుడు 5జీ ఉత్పత్తులను తయారు చేస్తోంది.
5జీ పరికరాల అమ్మకాల వృద్ధిలో తాము దూసుకుపోతున్నామని సంస్థ స్వయంగా ప్రకటన చేసింది. లాభాలు పెరగడమే కాకుండా 14 శాతం తమ వాటాలు వృద్ది సాధించాయని సంస్థ పేర్కొంది. 5 జి నెట్వర్క్లకు సంబంధించి పరికరాల తయారి మొదలుపెట్టడంతో నోకియాతో పాటుగా స్వీడన్ కంపెనీ ఎరిక్సన్ ఇప్పుడు లాభాలు ఎక్కువ అర్జిస్తున్నాయి. వీటితో పాటుగా పోటీలో ఉన్న చైనా సంస్థ హువావే మాత్రం ప్రభుత్వాల నుంచి ప్రైవసీ సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ సంవత్సరం 5జీలో భారీ డిమాండ్ చూశామని, ప్రాథమికంగా గృహాలు, కార్యాలయాలకు ఫైబర్ కనెక్షన్లు ఎక్కువగా కోరుకుంటున్నారు అని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పెక్కా లండ్మార్క్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. త్రైమాసిక ఆదాయం 3 శాతం పెరిగి సుమారు రూ. 45,600 కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు. నోకియా నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారంలో అమ్మకాలు 28 శాతం పెరిగి సుమారు రూ. 15,530 కోట్లకు చేరుకున్నాయని వివరించారు.