Tuesday, October 8, 2024

Nobel Prize Announced – ఫిజిక్స్ 2024 నోబెల్ గ్ర‌హీత‌లు వీరే…

స్టాక్‌హోం: భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్‌ న్యూరల్ నెట్‌వర్క్‌లతో మెషిన్ లెర్నింగ్‌ ఆవిష్కరణలకు గానూ ఈ అత్యున్నత పురస్కారం వరించింది. స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం ఈ పురస్కారాలను ప్రకటించింది.

గతేడాది (2023) భౌతికశాస్త్రంలో ఈ పురస్కారం ముగ్గురిని వరించింది. పరమాణువుల్లోని ఎలక్ట్రాన్ల కదలికలను శోధించిన ఫ్రాన్స్‌ శాస్త్రవేత్త పియర్‌ అగోస్తి, హంగేరియన్‌ సంతతి వ్యక్తి ఫెరెంక్‌ క్రౌజ్‌, ఫ్రాన్స్‌-స్వీడన్‌ శాస్త్రవేత్త యాన్‌ ఎల్‌ హ్యులియర్‌లు ఆ పురస్కారం అందుకున్నారు. మొత్తంగా 1901 నుంచి ఇప్పటివరకు 117సార్లు భౌతికశాస్త్రంలో నోబెల్‌ ప్రకటించారు.

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం అక్టోబర్‌ 14వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో విజేతలను ప్రకటించగా.. నేడు భౌతికశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడించారు. బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో విజేతలను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున నోబెల్‌ శాంతి బహుమతి , అక్టోబర్‌ 14న అర్థశాస్త్రంలో నోబెల్‌ గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.

స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. అవార్డు గ్రహీతలకు 11లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10లక్షల డాలర్లు) నగదు అందుతుంది. డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement