Tuesday, November 19, 2024

Nobel | ఇరాన్‌ హక్కుల కార్యకర్త నార్గిస్‌కు నోబెల్‌ శాంతి పుర‌స్కారం.. మహిళల అణచివేతపై జైలు నుంచే పోరాటం!

2023 సంవత్సరానికి నోబెల్‌ శాంతి పురస్కారానికిగాను జైల్లో ఉన్న మానవ హక్కుల కార్యకర్త నార్గిస్‌ మొహమ్మది ఎంపికయ్యారు. ”ఇరాన్‌లో మహిళల అణచివేతను వ్యతిరేకంగా, మానవహక్కుల పరిరక్షణకు, అందరికి స్వేచ్ఛ కోసం చేసిన పోరాటానికిగాను” నార్గిస్‌ మొహమ్మదిని శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఓస్లోలో నార్వే దేశపు నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ”మహిళలను లక్ష్యంగా చేసుకొని అణచివేత, వివక్షాపూరితమైన విధానాలను అనుసరిస్తున్న ఇరాన్‌ పాలకులకు వ్యతిరేకంగా నార్గిస్‌ వ్యక్తీకరించిన అంకితభావం, కార్యాచరణకు తగ్గట్టుగా ‘మహిళలు – జీవితం – స్వేచ్ఛ’ పేరిట ఆందోళనలు చేపట్టిన లక్షలాదిగా ప్రజలను గుర్తిస్తూ” శాంతి పురస్కార విజేతగా నార్గిస్‌ పేరును ప్రకటిస్తున్నట్టుగా పేర్కొంది.

ప్రస్తుతం జైల్లో ఉన్న మొహమ్మది తోటి నోబెల్‌ పురస్కార విజేత షిరిన్‌ ఎబడి నెలకొల్పిన మానవ హక్కుల పరిరక్షకుల కేంద్రానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆమె 13సార్లు అరెస్టయ్యారు. ఐదుసార్లు శిక్షకు గురయ్యారు. మొత్తం 31 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. మరణ శిక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటానికి గాను 2015లో ఆమె మరోసారి అరెస్టయ్యారు. కొద్ది సంవత్సరాలు కారాగారవాసాన్ని అనుభవించారు. కటకటాల వెనుక బందీగా ఉన్నప్పటికీ ఆందోళనలు యధావిధిగా కొనసాగడంలో మొహమ్మది సహకరించారని నోబెల్‌ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement