Saturday, November 23, 2024

యుద్ధపీడిత చిన్నారుల కోసం నోబెల్‌ శాంతి బహుమతి వేలం.. రష్యన్‌ జర్నలిస్ట్‌ వితరణ

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, రష్యన్‌ జర్నలిస్ట్‌ దిమిత్రి మురతోవ్‌ ఉక్రెయిన్‌లో యుద్ధపీడిత చిన్నారుల కోసం తన పతకాన్ని వేలం వేయగా అనూహ్యంగా అత్యధిక ధర పలికి సంచలనం సృష్టించింది. నోబెల్‌ శాంతి బహుమతిగా అందిన 175 గ్రాముల 23 కేరట్ల బంగారు పతకాన్ని కరిగిస్తే, దాని విలువ కేవలం 8వేల పౌండ్లు మాత్రమే. అయితే వేలంలో అత్యధికంగా 84.5 మిలియన్‌ పౌండ్ల ధర పలికింది. ఇప్పటివరకు జరిగిన నోబెల్‌ పతకాల వేలంలో ఇదే గరిష్ఠ ధర. న్యూయార్క్‌లో సోమవారంనాడు హెరిటేజ్‌ ఆక్షన్స్‌ సంస్థ వేలంపాట నిర్వహించింది. ఆ పతకాన్ని సొంతం చేసుకునేందుకు పాటదారులు పోటీపడటంతో ధర పరుగులెత్తింది.

గుర్తు తెలియని ఫోన్‌ నెంబర్‌నుంచి వేలం పాట పాడిన ఓ వ్యక్తి అత్యధిక ధరతో ఆ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. వేలం ద్వారా దక్కిన మొత్తాన్ని ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా చెల్లాచెదురైన బాలబాలికలకోసం ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని యునిసెఫ్‌కు అందేలా ఏర్పాట్లు చేశారు. రష్యాలో స్వతంత్రంగా నిర్వహిస్తున్న దినపత్రిక నొవయ గజెటకు దిమిత్ర మురతోవ్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా జూన్‌ 1న మొదలైన ఈ వేలంపాటలో ఆన్‌లైన్‌లోను, ప్రత్యక్షంగాను పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.

కాగా గురువారంనాడు రష్యానుంచి న్యూయార్క్‌ చేరుకున్న మురతోవ్‌ వేలంపాటను ప్రత్యక్షంగా పరిశీలించారు. గరిష్ట ధరకు వేలంపాటపాడిన వ్యక్తి విదేశీయుడిగా గుర్తించారు. 84.5 మిలియన్‌ పౌండ్ల మొత్తాన్ని వంద మిలియన్‌ డాలర్‌ స్విస్‌ ఫ్రాంక్‌లుగా మార్చి చెప్పడాన్ని బట్టి ఈ విషయం తెలిసింది. క్షణక్షణానికీ వేలంపాట పెరగడం, చివరకు ఊహించనివిధంగా పెద్దమొత్తం పలకడంతో వేలంపాటను గమనిస్తున్న మురతోవ్‌, ఇతర పాటదారులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మూడువారాలపాటు సాగిన వేలంపాట చివరకు ప్రపంచ శరణార్థుల దినోత్సవంనాడు ముగిసింది. ఇంత మొత్తం ధర పలుకుతుందని తాను భావించలేదని, యుద్ధ పీడిత ఉక్రెయిన్‌ బాలబాలికలపట్ల ప్రపంచం ఇంత స్థాయిలో సంఘీభావం ప్రకటించడం పట్ల తాను ఆనందంగా ఉన్నానని మురతోవ్‌ అభిప్రాయపడ్డారు.

ఈ పతకం వేలం ద్వారా వచ్చే మొత్తానికి అదనంగా తాను 4 లక్షల పౌండ్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు మురతోవ్‌ ముందే ప్రకటించారు. డీఎన్‌ఎ నిర్మాణాన్ని కనుగొన్నందుకు గాను నోబెల్‌ బహుమతిని (1962)లో సాధించినవారిలో ఒకరైన జేమ్స్‌ వాట్సన్‌ అనే శాస్త్రవేత్త తన పతకాన్ని 2014లో వేలం వేసినప్పుడు 3.9 మిలియన్‌ పౌండ్ల ధర పలకడమే ఇప్పటివరకు రికార్డు. కాగా ఇప్పుడు మురతోవ్‌ పతకం ఆ రికార్డును ఛేదించింది. ఈ వేలాన్ని కూడా హెరిటేజ్‌ ఆక్షన్స్‌ సంస్థే నిర్వహించింది. హెరిటేజ్‌ ఆక్షన్స్‌ సంస్థ సమర్థంగా వేలంపాట నిర్వహించినందుకు పెద్దఎత్తున ప్రశంసలు దక్కాయి. కాగా 2021 నోబెల్‌ శాంతి బహుమతిని రష్యాకు చెందిన మురతోవ్‌, ఫిలిప్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి అందుకున్నారు. భావస్వేచ్ఛ హక్కును పరిరక్షించడంలో వీరు చేసిన కృషికి గాను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది.

- Advertisement -

సోవి యట్‌ యూనియన్‌ పతనం తర్వాత 1993లో దిమిత్ర మురతోవ్‌ నొవయ గజెట పత్రికను ప్రారంభించారు. ఇంటాబయటా పుతిన్‌ చర్యలను, తప్పిదాలను రష్యాలో ఎటువంటి వెరపు లేకుండా ఎత్తిచూపుతున్న ఏకైక పత్రికగా నొవయ గజెట పేరుపొందింది. ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో పుతిన్‌ ప్రభుత్వం మీడియాపై కఠిన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో నొవయ గెజిటా పత్రిక ప్రచురణ నిలిచిపోయింది. ఏప్రిల్‌లో మురతోవ్‌ ఓ రైలులో ప్రయాణిస్తుండగా కొందరు దాడి చేశారు కాగా వేలంపాటలో వచ్చిన మొత్తాన్ని యునిసెఫ్‌కు అందించడానికి గల కారణాన్ని మురతోవ్‌ వివరించారు.

ప్రభుత్వాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే సంస్థ న్యాయం చేస్తుందని భావించానని, అందుకే నేరుగా నిధులు యునిసెఫ్‌కు చేరేలా వేలం నిర్వహించామని చెప్పారు. వేలంపాట ద్వారా వచ్చిన నిధులు తమకు చేరాయని యునిసెఫ్‌ కూడా నిర్ధారించింది. కాగా 2000 నుంచి ఇప్పటివరకు నొవయ గజెటాకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు, పెట్టుబడిదారులు హత్యకు గురైనారు. నోబెల్‌ శాంతి బహుమతిని వారికి అంకితం చేసినట్లు పురస్కార గ్రహీత మురతోవ్‌ అప్పట్లో ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement