న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: నకిలీ సీబీఐ అధికారి కొవ్విరెడ్డి శ్రీనివాస్ కస్టడీని పొడిగించాలంటూ సీబీఐ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. శనివారం నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దినేశ్ కుమార్ ఎదుట నిందితుడు శ్రీనివాస్‌ను సీబీఐ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మరో 4 రోజులు కస్టడీ పొడిగించాలని, విచారణకు శ్రీనివాస్ సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. సాక్షులను విచారణకు పిలిచి, వారికి ఎదురుగా శ్రీనివాస్‌ను ఉంచి ప్రశ్నిస్తున్నామని, తద్వారా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నామని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురు సాక్షులను పిలిచి విచారణ జరిపామని వెల్లడించారు.
అయితే ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ శ్రీనివాస్ ఫోన్ నుంచి సేకరించిన 1,100 ఫోన్ కాల్ రికార్డింగ్స్‌ను అనువదించి విశ్లేషించారా అని ప్రశ్నించారు. సీబీఐ తరఫు న్యాయవాది బదులిస్తూ ఇంకా చేయలేదని చెప్పారు. తదుపరి కస్టడీ ఎందుకు పొడిగించాలని న్యాయమూర్తి ప్రశ్నించగా.. మరికొందరు సాక్షులను విచారణ జరపాల్సి ఉందని, ఆ క్రమంలో ఎదురుగా పెట్టి (Confrontation) ప్రశ్నించడం కోసం శ్రీనివాస్ కస్టడీ కావాలని కోరారు. శ్రీనివాస్ మోసాలకు బాధితులుగా మారినవారిలో ప్రభుత్వ ఉన్నతోద్యోగులు, ప్రముఖులు ఉన్నారని తెలిపారు.
కేవలం కన్‌ఫ్రంటేషన్ తప్ప కస్టడీ పొడిగించడానికి ఇంకేదైనా కారణం ఉందా అని ప్రశ్నించగా.. నిందితుడు తనను తాను సీబీఐలో జాయింట్ డైరక్టర్ ర్యాంక్ అధికారిగా చెప్పుకుని పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డాడని గుర్తుచేశారు. ఎందుకు నకిలీ అధికారిగా అవతారమెత్తాడో తెలుసుకోవాల్సి ఉందని, ఆ క్రమంలోనే కస్టడీ పొడిగించాలని కోరారు. కేసులో సాక్షులందరూ హైదరాబాద్‌కు చెందినవారే ఉన్నారని, వారిని ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించడం వల్ల జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు.
శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అరెస్టు చేసినప్పటి నుంచి ఇన్ని రోజుల పాటు తమ కస్టడీలోనే ఉంచుకుని ప్రశ్నించారని, ఇంకా కన్‌ఫ్రంటేషన్ చేయాలంటే జైలు నుంచైనా చేయవచ్చని తెలిపారు. కేవలం సాక్షుల ఎదురుగా నిలబెట్టడం కోసమే అయితే కస్టడీ అవసరం లేదని చెప్పారు. శ్రీనివాస్ మీద తప్పు మోపడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని, కస్టడీలో సాధించిన ఆధారాలేవీ లేవని తెలిపారు. కస్టడీ పొడిగించడం అంటే శ్రీనివాస్‌తో బలవంతంగా చేయని నేరాన్ని ఒప్పించడం కోసమే అని సూత్రీకరించారు.
వాదోపవాదాల అనంతరం న్యాయమూర్తి నిందితుడికి సీబీఐ కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తదుపరి కన్‌ఫ్రంటేషన్ చేయాలనుకుంటే జైలు నుంచి కూడా చేయవచ్చని, దర్యాప్తు సంస్థ చట్టం పరిధిలోనే దర్యాప్తు చేయాలని వ్యాఖ్యానించారు. శ్రీనివాస్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తిహార్ జైలుకు తరలించాలని ఆదేశించారు. ఈ నెల 16 వరకు శ్రీనివాస్‌కు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.