అమరావతి, ఆంధ్రప్రభ, బ్యూరో : రాష్ట్రం లో అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు మెరుగైన విద్యను అందించాలని కేంద్ర ప్రభు త్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కెజిబివి)లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభు త్వం పర్యవేక్షణలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న కస్తూర్బా విద్యాలయాల ఏర్పాటు తో బాలికల్లో విద్యావంతుల శాతం క్రమేనా పెరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వెనుకబడిన బాలికలంతా విద్యతో వెలుగులోకి వస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్య త, ప్రాధాన్యత కలిగిన కస్తూర్బా విద్యాలయా లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉపాధ్యా యులు, ఇతర సిబ్బంది లేకపోవడంతో విద్యా ర్ధినులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 352 విద్యాలయా లకు సంబంధించి సుమారు 2336 పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే కస్తూర్బా విద్యాలయాల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 352 విద్యాలయాల పరిధిలో 9170 మంది టీచిం గ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు అవసరం కాగా 6834 మంది ఉద్యోగులు మాత్రమే సేవలంది స్తున్నారు. మిగిలిన 2336 పోస్టులు సంవత్స రాల తరబడి ఖాళీగానే ఉండడంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతుంది. అత్యవసర సమయంలో వారు కూడా విద్యార్ధినులకు పూర్తి స్థాయిలో సేవలందించలేకపోతున్నారు. రాత్రి సమయంలో హాస్టల్‌లో కూడా కొంతమంది వార్డెన్లు అందుబాటులో ఉండకపోవడంతో బాలికలకు రక్షణ కూడా కరువవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని హాస్టళ్లలోనూ ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొంతమంది వార్డెన్లు నిజాయితీగా పనిచేస్తున్నప్పటికీ రాత్రి సమయంలో హాస్టల్ భవనాలకు వాచ్‌మెన్‌లు లేకపోవడంతో భద్రత కూడా గాలిలో దీపంలా తయారవుతుంది. అందుబాటులో ఉన్న మహిళా వార్డెన్లు కూడా భయపడుతూనే రాత్రి సమయంలో బాలికలకు రక్షణగా నిలవాల్సి వస్తోంది.
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా..భర్తీకి నోచుకుని పోస్టులు
రాష్ట్రంలోని 26 జిల్లాల పరిధిలో 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే బాలికల సంఖ్య సుమారు 93 వేలకు పైగా ఉంది. వీరిలో హాస్టల్‌లో బస చేసే వారి సంఖ్య 14,500కు పైగానే ఉంది. మిగిలిన 78 వేల మంది బాలికలు నిత్యం ఆయా ప్రాంతాల నుంచి విద్యాలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. 14,500 మంది బాలికలకు ఆయా విద్యాలయాలకు సమీపంలోనే ప్రత్యేకంగా వసతి సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విద్యాలయాలతో పాటు హాస్టల్ భవనాలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ సిబ్బంది కొరతే మరింత ఇబ్బందికరంగా మారింది. విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది బోధకులు లేరు. ప్రతీ ఏటా విద్యాలయాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా అవసరం అయిన పోస్టులు మాత్రం భర్తీకి నోచుకోవడం లేదు. 2004-05 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, బీపీఎల్ కుటుంబాలతో పాటు పట్టణాల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 6వ తరగతి నుంచి ఇంటర్మిడియట్ విద్య వరకు అందించేందుకు ఈ విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పదేళ్ల నుంచి 18 సంవత్సరాల వయస్సు కలిగిన బాలికలకు ఈ విద్యాలయాల్లో అవకాశం కల్పిస్తున్నారు. దీంతో క్రమేనా కస్తూర్బా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2019-20 సంవత్సరానికి సంబంధించి 75,655 మంది విద్యార్థులు ఉండగా, 2020-21 సంవత్సరానికి సంబంధించి 82,188కి పెరిగింది. 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆ సంఖ్య 95,464కు చేరుకుంది. అలాగే 2022-23 సంవత్సరానికి సంబంధించి లక్షకు చేరువలోకి విద్యార్థుల సంఖ్య చేరింది. ప్రస్తుత ఏడాది విద్యా సంవత్సరం ఆరంభం అయ్యే నాటికి లక్ష దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను మాత్రం భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకోలేకపోతుంది.
మంజూరు చేసినా..భర్తీకి నోచుకోని వైనం
కస్తూర్బా విద్యాలయాలకు సంబంధించి 9,170 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే 6,834 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. మిగిలిన 2336 పోస్టులను నేటి వరకు భర్తీ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా 352 విద్యాలయాల్లో బోధనా సిబ్బంది 4,594 మంది అవసరం కాగా ప్రస్తుతం 3,018 మంది మాత్రమే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అదేవిధంగా మరో 4,576 ఔట్‌సోర్సింగ్ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ 3,816 మంది మాత్రమే పనిచేస్తున్నారు. సుమారు 760 ఔట్‌సోర్సింగ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతుంది. ఇక నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో హాస్టల్‌లోనూ అనేక సమస్యలను విద్యార్థులు ఎదుర్కోవలసి వస్తుంది. కొంతమంది హాస్టల్ వార్డెన్లు రాత్రి సమయాల్లో బాలికలను ఒంటరిగా వదిలేసి సమీపంలోని వారి స్వగ్రామాలకు వార్డెన్లు వెళ్లిపోతున్నారు. దీంతో అగంతకులు హాస్టల్ గోడ దూకి విద్యార్థుల గదుల్లోకి వెళ్తున్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో ఈ తరహా సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు, సంబంధిత శాఖ అధికారులు కస్తూర్బా విద్యాలయాలకు సంబంధించిన ఖాళీలను తక్షణమే భర్తీ చేసి విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు హాస్టల్ విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.