హైదరాబాద్, ప్రభన్యూస్ : సన్నరకం వరి ధాన్యం పండించిన రైతులను మిల్లర్లు నిలువు దోపీడీ చేస్తున్నారు. కనీస మద్దతు ధర చెల్లించాల్సి ఉన్నా నిర్ధాక్షిణ్యంగా ఎగ్గొడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఆర్ (రాజేంద్రనగర్ లేదా తెలంగాణ సన్నాలు) పండించిన రైతులు మిల్లర్ల మాయాజాలానికి బలైపోతున్నారు. ఆర్‌ఎన్‌ఆర్, సోనా మసూరి రకాలు తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఖరీఫ్‌లో ఈ రకాలు సాగవుతుంటాయి. యాసంగిలోనూ నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ గణనీయంగా సాగవుతున్నాయి. సన్నాలకు ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1940 మద్దతు ధర చెల్లించాలి. అయితే మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రూ.1650 ధర మాత్రమే పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.
గ్రేడ్ ఏ ధాన్యం మద్దతు ధర క్వింటాకు రూ.1960 ఉండగా… క్వింటాకు రూ.1750 మించి ఎక్కడా ధర చెల్లించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సన్నరకం ధాన్యం సాగుచేస్తే మిల్లర్లతో రూ.2000 తక్కువ కాకుండా ధర ఇప్పిస్తామని యాసంగి సీజన్ ప్రారంభంలో స్థానిక ప్రజాప్రతినిధులు రైతులను ప్రోత్సహించారు. తీరా ధాన్యాన్ని మిల్లులకు తీసుకొచ్చాక మిల్లర్లు మద్దతు ధర కాదు కదా ఏకంగా రూ.300 దాకా తగ్గిస్తున్నారు. సన్నాల వరి కోతల ప్రారంభ సమయంలో మిల్లర్లు చింట్లు రకానికి క్వింటాకు రూ.2160, హెచ్‌ఎంటీలకు రూ.1950 వరకు ధర చెల్లించారు. ఆ తరువాత నూర్పిడి ముమ్మరమై ధాన్యం పోటెత్తుతుండటంతో మిల్లర్లు సిండికేట్‌గా మారి ఒక్కసారిగా ధర తగ్గించారు. ప్రమాణాల మేరకు ఆరబెట్టి తెచ్చిన ధాన్యానికి సైతం మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల్లో దొడ్డురకం ధాన్యాన్నే కొనుగోలు చేస్తుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు మిల్లర్లు నిర్ణయించిన ధరకే విక్రయించి నష్టపోతున్నారు. మార్కెటింగ్, సివిల్‌సప్లయ్ శాఖల అధికారులు తమ దృష్టంతా దొడ్డు ధాన్యం కొనుగోళ్లపైనే పెట్టడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు తాలు, పచ్చగింజ, బెరుకుల పేరుతో తరుగు, కమిషన్ పేరుతో మరికొంత దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..