Tuesday, November 26, 2024

ఉప్పుడు బియ్యం వద్దు.. ముడిబియ్యం ప్రతి గింజా కొంటాం: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఉప్పుడు బియ్యం తినే రాష్ట్రాల్లో వినియోగం తగ్గిందని, మిగతా ఎక్కడా ఆ బియ్యం తినడం లేదని, ఉచితంగా ఇచ్చినా తినే పరిస్థితి లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేవలం తెలంగాణలోనే కాదు, బాయిల్డ్ రైస్ ఉత్పత్తి చేసే అన్ని రాష్ట్రాలను కూడా ఇకపై వద్దని కేంద్రం కోరుతూ వచ్చిందని ఆయన వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కేసీఆర్ రైతు దీక్షపై విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి, వితంతవాదం, విషప్రచారం చాలా విచిత్రంగా ఉందని విస్మయం వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయ మోటర్లకు కేంద్రం మీటర్లు పెడుతుంది అంటూ నానా హంగామా చేశారని, మీటర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని రైతులు కూడా అర్ధం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు వడ్ల విషయంలో లేని సమస్యను ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారని, ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని మీరు రాసిచ్చిన మాట నిజమా కాదా అని ఆయన ప్రశ్నించారు.

గత టార్గెటే పూర్తి చేయలేదు
గత సీజన్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వాల్సిన బియ్యమే ఇంకా ఇవ్వలేదని కిషన్ అన్నారు. గత సీజన్‌లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం చివరి గింజ వరకు కొంటామని చెప్పానని, ఆ అగ్రిమెంట్‌లో మిగులు బాయిల్డ్ రైస్ ఉంటే, అది కూడా కొంటామని తాను అన్నానని అంగీకరించారు. 8.34 లక్షల మెట్రిక్ టన్నుల (ఇందులో 1.34 లక్షల బాయిల్డ్ రైస్ కలుపుకుని) ఇవ్వాల్సిన బియ్యమే ఇప్పటివరకు ఎఫ్‌సీఐకి అందించలేదని, ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. కేంద్రం ఆరు సార్లు టార్గెట్ పొడిగించిందని వివరించారు. అప్పటి బియ్యమే ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోయారు? అంత పంట పండలేదా? లేదా రైస్ మిల్లర్లు విదేశాలకు ఎగుమతి చేసుకున్నారా? అసలు ఏమైందో చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను కాదని, మేము చెబితేనే రైతులు వరి సాగు చేసినట్టు ప్రచారం చేస్తున్నారని, మోటర్లకు మీటర్ల విషయంలో ఎలాగైతే తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు కూడా అలాగే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రబీలో వచ్చిన దిగుబడిని బాయిల్డ్ రైస్ చేయకుండా నేరుగా మిల్లు పట్టించి ఇవ్వాలని కోరిన ఆయన, ఆ మాత్రం కూడా చేయలేరా అని నిలదీశారు.

నూకల నష్టాన్ని భరించలేరా.. ఉచిత ఎరువుల సంగతేంటి?
నియమాల ప్రకారం కేంద్రం కూడా కొంత శాతం నూకలు తీసుకుంటుందని, ఎఫ్‌సీఐ 25శాతం నూకలు అనుమతిస్తుందని అన్నారు. ఇవన్నీ పోను మిగిలే నూకలు చాలా తక్కువ ఉంటాయని, కర్ణాటక, ఏపీ సహా ఇతర రాష్ట్రాలు ఆ నష్టాన్ని భరిస్తున్నాయన్న కిషన్‌రెడ్డి, ఆ మాత్రం రాష్ట్రం భరించలేదా అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల ద్వారా రాష్ట్ర సివిల్ సప్లైస్ పనిచేస్తుందని కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతి క్వింటా మీద రూ. 3,187/- కేంద్రం ఖర్చు చేస్తోందని, బస్తా సంచులకు, సుతిలి దారానికి, హమాలీలకు… ఇలా అన్ని ఖర్చులను కేంద్రమే భరిస్తోందని వివరించారు. రైతులకు ఎరువులు ఉచితంగా ఇచ్చి ప్రపంచంలోనే సంచలనం, చరిత్ర సృష్టిస్తామని కేసీఆర్ ప్రకటించినా ఇంతవరకూ అది అమలే కాలేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. 24 లేదా 26 లక్షల టన్నుల ఎరువులు తెలంగాణలో రైతులకు 100 శాతం ఉచితంగా సరఫరా చేస్తామని కేసీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో కిషన్‌రెడ్డి అప్పటి కేసీఆర్ ప్రకటనల వీడియోలను ప్లే చేసి మీడియాకు చూపించారు.

కేంద్రం మాట తప్పలేదు
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే రైతు సమన్వయ సమితులు కొంటాయని కేసీఆర్ అన్నారని ఆయన చెప్పుకొచ్చారు. సమితులు ఉన్నాయో లేవో గానీ ఛైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాత్రం ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులు వడ్లనే పండిస్తారే గానీ బాయిల్డ్ రైస్ పండించరని వ్యాఖ్యానించారు. రైతు పండిన వడ్లను రా రైస్ చేయాలా లేక బాయిల్డ్ రైస్ చేయాలా అన్నది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో బాయిల్డ్ రైస్ లేదని, ఓ 20 రోజులు ముందు సాగు మొదలుపెట్టినా, విత్తనం రకాన్ని మార్చినా ఉప్పుడుబియ్యం సమస్య ఉత్పన్నం కాదని అభిప్రాయపడ్డారు. కేంద్రం టార్గెట్‌ను అందుకోలేకపోయింది మీరేనని, కేంద్రం ఎక్కడా మాట తప్పలేదని కేంద్రమంత్రి విమర్శించారు. ఇచ్చిన అంచనాకు మించి కేంద్రం కొంటూ వచ్చిందని, ఇప్పటికైనా ముడి బియ్యం సరఫరా చేస్తే చివరి గింజ వరకు కేంద్రం కొనుగోలు చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు.

అందరికీ ఒకే విధానం
పంజాబ్‌లో వరి ఒకే పంట సాగవుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు ఒక విధానం, దేశంలో మిగతా రాష్ట్రాలకు ఇంకో విధానం లేదని ఆయన చెప్పారు. తాను 2004లో ఎమ్మెల్యే అయినప్పటి కంటే ముందు నుంచే ఈ విధానం ఉందని, తమ హయాంలో చేసింది కాదని ఉద్ఘాటించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ సేకరణ విధానం ఎందుకు మార్చలేదని ఆయన తీవ్రస్థాయిలో నిలదీశారు. ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న చందంగా పోటీలు పడి, వంతులు వేసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నారని, ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ఏరోజూ వెనుకడుగు వేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి రాకముందు రూ. 3,400 కోట్లు మాత్రమే తెలంగాణ రైతుకు ఇస్తే, తాము అధికారంలోకి వచ్చాక రూ 26 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

మద్దతు ధర పెంచడమే రైతు వ్యతిరేక విధానమా?
కేసీఆర్ చేసింది రైతు దీక్ష, రైతు పోరాటం కాదన్న కిషన్‌రెడ్డి, ఆయనది రాజకీయ ఆరాటం, అధికారం నిలుపుకోవడం కోసం చేసే ప్రయత్నమని ధ్వజమెత్తారు. ముద్దుల కొడుక్కి అధికారం కట్టబెట్టడం కోసం చేసే ప్రయత్నమన్నారు. తెలంగాణలో బాయిల్డ్ రైస్ తీసుకోకుండా, పంజాబ్‌లో తీసుకుంటే తాము దేనికైనా సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు. కనీస మద్ధతు ధర పెంచడమే మా పొరపాటా? ఇదే రైతు వ్యతిరేక విధానమా? అని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక ధర ఉంటే తాము అధికారంలోకి వచ్చాక అనేక పంటలకు 50 శాతానికి పైగా కనీస మద్దతు ధర పెంచామని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఒకే విధానం ఉందని, కేసీఆర్ కుటుంబంలోనే వేర్వేరు విధానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కుటుంబ రాజకీయాల మీద ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధం ప్రకటించారని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. దాన్ని ఎదుర్కోవడం కోసమే ఈ యుద్ధమని ఆయన చెప్పుకొచ్చారు. కుటుంబ రాజకీయాలకు తెలంగాణ ప్రజలు తిలోదకాలు ఇవ్వనున్నారని జోస్యం చెప్పారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదని, ఆ కుటుంబం అడుగులకు మడుగులొత్తడం కోసం కాదని నొక్కి చెప్పారు. కేసీఆర్‌ను టచ్ చేయాల్సిన అవసరం లేదన్న మోదీకి లేదని, ఆయనకు చాలా పనులున్నాయని, తెలంగాణ ప్రజలే త్వరలో కేసీఆర్‌ను టచ్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం బాయిల్డ్ రైస్ వద్దనలేదని, దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇదే చెప్పామని, ప్రజాధనం వృథా చేయకూడదనే వద్దని చెబుతున్నామన్నారు.

అవినీతిని చూస్తూ ఊరుకోము
నూకల శాతం తగ్గించేలా ఆంధ్రప్రదేశ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఉప్పుడు బియ్యం విషయంలో ఆ రాష్ట్రం కూడా అంగీకరించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక బడ్జెట్ పెట్టి మరీ తాము నూకల నష్టాన్ని భరిస్తామని అన్నారు. రాజకీయ దురుద్దేశాలతో కేసులు ఉండవని చెప్పామే తప్ప అవినీతిని చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. రాజకీయ చదరంగంలో పుత్రవాత్సల్యంతో తెలంగాణ రైతులను బలి చేయవద్దని కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా పండిన పంటను ముడి బియ్యంగా మారిస్తే కేంద్రం తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. ఎందరో సీఎంలు వచ్చారు, పోయారు, వ్యవస్థలను నిర్వీర్యం చేయొద్దని గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థ మీద కత్తులు నూరడం సరికాదని, ఒక ఎమ్మెల్సీ విషయంలో వారు చెప్పింది ఆమె వినలేదని ఇబ్బందులకు గురి చేయడం సబబు కాదని ఆయన హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement