హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రత్యామ్న్యాయ పంటల ప్రణాళికను విడుదల చేసింది. రాష్ట్రాన్ని ఉత్తర, మధ్య, దక్షిణ ఇలా మూడు పంటల సాగు జోన్లుగా విభజించింది. వర్షాలు కురవకపోవడంతో జోన్ల వారీగా ప్రత్యామ్న్యాయ పంటలు ఏవి సాగుచేయాలో రైతులకు వివరిస్తూ కంటిజెన్సీ /ప్రత్యామ్న్యాయ సాగు ప్రణాళికను ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా విడుదల చేసింది. ఏ యే జిల్లాలో జులై 31 వరకు, ఆగస్టు 15 వరకు ఏయే పంట విత్తనాలు విత్తుకోవాలో ప్రత్యేకంగా సూచించింది.
ఆయా పంటలను ఆశించే చీడపీడలను కూడా వివరిస్తూ వాటి విషయంలో అవలంభించాల్సిన సమగ్ర సస్యరక్షణా పద్దతులను కూడా వివరించింది. అయితే రైతులు తమ పరిధిలోని వ్యవసాయాధికారులను సంప్రదించి తమ నేలలకు అనువైన పంట రకాలను తెలుసుకుని అదనులోగా విత్తుకోవాలని స్పష్టం చేసింది. ఆయా సాగు జోన్లలో ఈ ఏడాది నమోదైన లోటు వర్షపాతాన్ని కూడా ప్రణాళికలో వివరించారు. కాగా… రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితులను వ్యవసాయ ఉన్నతాధికారులు, వ్యవసాయశాఖ మంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు తగిన సలహాలు సూచనలందిస్తున్నారని వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు తెలిపారు.
ప్రస్తుతం పంటల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. మధ్య తెలంగాణ జోన్‌లో మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలను చేర్చింది. జిల్లాల వారీగా ఆగస్టు 15 వరకు ఏయే ప్రత్యామ్న్యాయ పంటలను సాగు చేయాలో వివరించింది. ఈ జోన్‌లోజులై 31 వరకు కంది, జొన్న, కూరగాయాలు, నీటివసతి ఉన్న చోట మొక్కజొన్న, పొద్దు తిరుగుడు తదితర పంటలు, ఆగస్టు 15 వరకు అన్ని జిల్లాల్లో కంది పొద్దుతిరుతుడు, ఉలవలు, కూరగయాల పంటలను సాగు చేయొచ్చని తెలిపింది. ఉత్తర తెలంగాణ వ్యవసాయ జోన్‌లో ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలను చేర్చింది.
ఈ జోన్‌లో జిల్లాల వారీగా జులై 31 వరకు సల్వకాలిక మొక్కజొన్న, కంది, ఆగస్టు 15 వరకు కంది, కూరగాయల పంట విత్తనాలను విత్తుకోవాలని సూచించింది. దక్షిణ తెలంగాణ సాగు జోన్‌లో వికారాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలను చేర్చింది. ఈ ప్రాంతంలో జిల్లాల వారీగా జులై 31 వరకు కంది, ఆముదాలు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, కూరగయాల పంటల విత్తనాలను విత్తుకోవాలని, ఆగస్టు 15 వరకు కంది, ఆముదం, స్వల్పకాలిక కూరగాయ పంటల విత్తనాలను విత్తుకోవాలని సూచించింది. అయితే ఆయా జిల్లాల రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి నేలలకు అనువైన విత్తన రకాలను, అదనులో విత్తుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది.