రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించేందుకు వీటిని జీఎస్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ గత కొంతకాలంగా ఎక్కువైంది. దీంతో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం, గ్యాస్‌లను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వీటిపై జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదని లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చింది. అయితే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు సేవల పన్నులోకి తెచ్చే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్ సరైన సమయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో వీటిని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులను తగ్గించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అదే సమయంలో రాష్ట్రాలు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్సైజ్, వ్యాట్ తగ్గింపు విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పరస్పరం ఆలోచన చేయాల్సి ఉందని అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు.