Monday, November 25, 2024

మెడికల్ కాలేజీల కోసం తెలంగాణ నుంచి ఎలాంటి ప్ర‌తిపాద‌న రాలేదు..

ప్ర‌భ‌న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెడికల్‌ కాలేజీల కోసం ఎలాంటి ప్రతిపాదన పంపించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డా.భారతి ప్రవీణ్‌ పవార్‌ లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 35 మెడికల్‌ కాలేజీలు, ఆస్పత్రులున్నాయని, అందులో ప్రభుత్వ రంగం నుంచి 12, ప్రైవేట్‌ రంగం నుంచి 23 ఉన్నాయని ఆమె తెలిపారు. వీటన్నింటిలో కలిపి 5,240 ఎంబీబీఎస్‌ సీట్లు, 2,237 పీజీ మెడికల్‌ సీట్లు ఉన్నాయని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా జిల్లా ఆస్పత్రులకు అనుబంధంగా మెడికల్‌ కాలేజీల ఏర్పాటు కోసం కేంద్రం ఓ పథకాన్ని తీసుకొచ్చిందని, దీని కింద 75 మెడికల్‌ కాలేజీలను కేంద్ర ఆరోగ్యశాఖ ఆమోదించిందని తెలిపారు. కానీ ఆ పథకం కింద కొత్త మెడికల్‌ కాలేజీల కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని పేర్కొన్నారు. మరోవైపు ‘ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన’ కింద రూ.1,028 కోట్లతో తెలంగాణలో బీబీనగర్‌ వద్ద ఆలిండియా ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ ఎయిమ్స్‌ సంస్థ మంజూ రైందని, 2024 నాటికి నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement