ఫలక్‌నుమా రైలు ప్రమాద ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ చెప్పారు. ప్రయాణికుల సంబంధీకులు ఎవరూ ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయని, మరో నాలుగు బోగీలు పాక్షికంగా కాలిపోయాయని తెలిపారు. ఆ బోగీల్లోని ప్రయాణికులను సికింద్రాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు.
కాగా, అగ్ని ప్రమాదానికి గురైన రైలు ఘటనా స్థలాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. తమకు ఉ.11.30 గంటలకు ప్రమాదం గురించి సమాచారం వచ్చిందని, వెంటనే అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఇక్కడే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉందని, పిల్లలు, టీచర్లు అంతా సహాయకచర్యల్లో పాల్గొనట్టు చెప్పారు. మొదట ప్రయాణికులకు స్కూల్లో ఉంచి భోజన ఏర్పాట్లు కూడా చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వారిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కి పంపించినట్టు కలెక్టర్ వివరించారు.