Monday, November 18, 2024

TG | మెట్రో రెండో దశపై ఎవరూ ముందుకు రావడం లేదు !

రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న మెట్రో రైలు రెండో దశకు అనేక సమస్యలు వెంటాడుతున్నాయని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ భరించలేని భారమని, సెకండ్‌ ఫేజ్‌ సవాళ్లతో కూడుకున్నదని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండో దశ నిర్వహణకు ప్రైవేటు సంస్థలేవీ ముందుకు రావడం లేదని, అందుకు మొదటి దశ నష్టాలే కారణమని స్పష్టం చేశారు. సోమవారం ఆడిట్‌ వీక్‌ వారోత్సవాలను పురస్కరించుకుని అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఎన్వీఎస్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫస్ట్‌ ఫేజ్‌ మెట్రో వల్ల ఎల్‌ అండ్‌ టీకి రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందని, ఏడాదికి రూ.1300 కోట్ల నష్టాన్ని ఎల్‌ అండ్ టీ సంస్థ భరిస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవి ముందుకు రావడం లేదని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. మెట్రో నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదని వివరించారు.

మెట్రో రైలు సెకండ్‌ ఫేజ్‌పై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. రెండో దశలో దాదాపు 76 కిలో మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు.

రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవుతాయని, ఇందులో 48 శాతం నిధులు జైకా ద్వారా సమకూరుతున్నాయని వెల్లడించారు. మంత్రివర్గ ఆమోదం తర్వాతే కేంద్రానికి సిఫారసులు పంపామని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ప్రజల సహకారం ఉంటే రెండో దశను శరవేగంగా పూర్తి చేస్తామని ఎన్వీఎస్‌ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement