Wednesday, November 20, 2024

తెలంగాణలో ఒమిక్రాన్ లేదు.. ఆ 13 మందికి నెగిటివ్ రిపోర్ట్..

ప్ర‌భ‌న్యూస్ : విదేశాల నుంచి తెలంగాణకు వచ్చిన ప్రయాణికుల్లో ఎవరూ కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారిన పడలేదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. బ్రిటన్‌ నుంచి వచ్చిన మహిళతోపాటు మరో 12మంది మొత్తం 13 మందికి ఒమిక్రాన్‌ నెగెటివ్‌గా తేలిందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ.శ్రీనివాసరావు తెలిపారు. ఒమిక్రాన్‌ వ్యాప్తిలో ఉన్న దేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ద్వారా ఇప్పటి వరకు తెలంగాణకు 1805 మంది ప్రయాణికులు వచ్చారు. వీరంతా ఒమిక్రాన్‌ వ్యాప్తిలో ఉన్న బ్రిటన్‌, కెనడా, అమెరికా, సింగపూర్‌ దేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ద్వారా తెలంగాణకు వచ్చారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన తొమ్మిది మందికి, అమెరికా, కెనడా, సింగపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురికి కొవిడ్‌ సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది.

వీరి శాంపిళ్లను వైద్య, ఆరోగ్యశాఖ జీనోమ్‌ టెస్టుకు పంపింది. మొత్తం 13 మంది టెస్టు ఫలితాలు వచ్చాయి. అయితే వీరిలో ఎవరికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకలేదని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా… తెలంగాణకు 535 మంది ప్రయాణికులు ఒమిక్రాన్‌ రిస్క్‌ ఉన్న దేశాల నుంచి వచ్చారు. బ్రిటన్‌ నుంచి వచ్చిన మహిళ (35) స్వస్థలం రంగారెడ్డి జిల్లా అని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చినా ముప్పు తొలగిపోలేదని, పొరుగున ఉన్న మహారాష్ట్రలో ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రజలంతా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement