Friday, November 22, 2024

24గంటల కరెంటు వద్దు.. దినమంతా కరెంటుతో అడుగంటిపోయిన భూగర్భ జలాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా ఉంది… ఈ యాసంగిలో వరి సాగు చేసిన రైతుల పరిస్థితి. వ్యవసాయానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న 24 గంటల కరెంటుతో మేలు జరగాల్సింది పోయి నష్టమే ఎక్కువగా జరుగుతోందని రైతులు వాపోతున్నారు. యాసంగిలో వ్యవసాయానికి ఉదయం, పగటి వేళల్లో 9 గంటల నాణ్యమైన 3ఫేజ్‌ కరెంటు ఇస్తే చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. ప్రస్తుతం 24గంటల కరెంటు ఇస్తుండడంతో భూ గర్భ జలాలు వేగంగా అడుగంటి పోయాయని, ఎక్కడి ఊటను అక్కడే బోర్లు ఎత్తిపోస్తుండడంతో ఏ రై తూ పొలమూ పారని పరిస్థితులు గ్రామాల్లో నెలకొన్నాయి. ఫలితంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఏ గ్రామం వెళ్లినా ఎండిపోతున్న వరిచేలే దర్శనమిస్తున్నాయి. మరో 15 రోజులు పారితే వరి చేలు చేతికి వస్తాయని, ఈ సమయంలో 24గంటల కరెంటు కారణంగా భూగర్భ జలాలు వేగంగా అడుగంటి పోతున్నాయి. గ్రామాల్లో 90శాతం మంది 2 నుంచి 3 ఎకరాల వరి పొలం ఉన్న సన్న, చిన్నకారు రైతులే.

- Advertisement -

ప్రస్తుతం వరి పొట్టకు వచ్చి ఈనుతున్న దశలో ఒక ఎకరం, 2 ఎకరాలు ఉన్న రైతుల పొలాలు కూడా ఎండిపోతున్నాయి. బోర్లకు ఆటోమెటిక్‌ స్ట్రార్టర్లు బిగించడంతో 24 గంటలపాటు బోర్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. ఫలితంగా అంతర్భూజల నీటి ఊటలు ఎక్కడికక్కడే అడుగంటిపోతుండడంతో 10 రోజుల క్రితం 9 గంటల కరెంటు సరఫరా అవుతున్నపుడు బాగా పోసిన బోర్లు కూడా వట్టిపోతున్నాయి. 24 గంటల కరెంటుతో గ్రామంలోని నలుగురైదుగురు మోతుబరి రైతులకు మాత్రమే మేలు జరుగుతోందని, ఎకరం, రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు 24 గంటల కరెంటు కారణంగా బావులపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దినమంతా వేచిచూసినా బావుల్లో గజం మేర కూడా నీరు ఊరడం లేదని, బోర్లు ఎక్కడి ఊటను అక్కడే 24గంటలపాటు ఎత్తిపోయడమే ఇందుకు కారణమని రైతులు చెబుతున్నారు.

వ్యవసాయానికి యాసంగిలో 24 గంటల కరెంటు విషయంలో ఇటు ప్రతిపక్షాలు, అటు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము 9 గంటల నాణ్యమైన 3ఫేజ్‌ కరెంటు అడిగామే కాని.. 24 గంటల కరెంటు అడగలేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రతిపక్షాలు ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు చేసిన 24గంటల కరెంటు ఇప్పుడు తమ కొంపముంచుతోందని రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా 24 గంటల కరెంటు కాకుండా ఉదయం, పగటి వేళల్లో 9 గంట లకరెంటు ఇస్తే చాలని, అప్పుడే ఈ 15 రోజులపాటు వరి పొలాలను కనీసం వరుస తడులతోనైనా కాపాడుకునే అవకాశముందని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.

బోర్ల నుంచి విచ్చలవిడిగా భూగర్భ జలాలను తోడేస్తుండడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. మూడేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడం, సాగునీటి వనరులు కూడా అందుబాటులోకి రావడంతో రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్నారు.ఈ ఏడాది రికార్డు స్థాయిలో రాష్ట్రంలో యాసంగిలోనే 60లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరిసాగు రెండింతలు పెరగడం మూలంగాను భూగర్భమట్టాలు వేగంగా తగ్గిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వరి చేలు ఈనుతున్న దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరో 15 రోజులు వరుస తడులు ఇచ్చినా వరి పంట చేతికందే పరిస్థితులు ఉన్నాయి. కాని ఆ మాత్రం కూడా నీటి ని బోర్లు, బావులు అందించకపోవడంతో కళ్లముందే ఎండిపోతున్న వరి పొలాలను చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement